APpolitics:ఒక్క ఛాన్స్ జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్: చంద్రబాబు

Chandrababu:     ‘ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు శవయాత్ర చేయబోతున్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం అంటూ ఊళ్ల మీద పడిన సైకో జగన్ ని ఓడించడానికి జనం సిద్ధమైపోయార’ని టీడీపీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు  స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసక దోపిడీలకు కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలమన్నారు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికే భారమని అన్నారు. ప్రజలకు మంచి చేయడం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకత్వంతోనే సాధ్యమని తెలిపారు. బుధవారం రాత్రి  విజయనగరంలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ “ఈ ముఖ్యమంత్రి గత రెండు ఎన్నికల్లో శవ రాజకీయంతో ప్రజల ముందుకు వచ్చాడు. ఈసారి గులకరాయి డ్రామా మొదలుపెట్టాడు. ఈ ప్రభుత్వానికి పాడె కట్టించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. జగన్. నీ రాజకీయాలు అయిపోయాయి. రాబోయేది కూటమి ప్రభుత్వమే. ప్రమాణస్వీకారానికి ముహుర్తం కూడా సిద్ధం చేస్తున్నాం. గత ఎన్నికల్లో పాదయాత్రగా వచ్చాడు. బుగ్గులు నిమిరాడు, ముద్దులు పెడితే ఐసైపోయి ఓటు వేశారు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఉత్తరాంధ్రకు ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు. నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. మీ అరాచక పాలనకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయనగరం రాజ కుటుంబం సింహాచలం ట్రస్ట్ బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారని .. మాన్సాస్ ట్రస్ట్ మీదే అవినీతి ఆరోపణలు చేశారన్నారు. అశోక్  గజపతి రాజుని వేధించినందుకు జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదన్నారు. పవన్ కళ్యాణ్,  నా మీద నమ్మకానికి.. మోదీ భరోసా తోడుందన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కలిశామని చంద్రబాబు తేల్చిచెప్పారు.

ఉత్తరాంధ్రను వంచించారు..

ఉత్తరాంధ్రను జగన్ ఘోరంగా వంచించారన్నారు చంద్రబాబు.  టీడీపీ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఐదేళ్లలో జగన్ చేసిన ఖర్చెంతో చెప్పగలడా? అని ఆయన ప్రశ్నించారు. వంశధార, నాగావళి అనుసంధానానికి వెళ్లామని.. పోలవరం పూర్తి చేసి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేయాలనుకున్నామన్నారు. గత ఐదేళ్లలో నిత్యవసర ధరలు పెరిగాయన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని… మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారని.. మద్యం ధర పెంచేశారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ రేట్లు, పన్నులు విపరీతంగా వేశాడని.. రాష్ట్రంలో పేదవాడి బతుకు భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ జలగ్గా మారి ప్రజల జీవితాలు నాశనం చేశాడని… ఎన్నికలకు 18 రోజుల సమయమే ఉందన్నారు. ప్రజలంతా జనసేన, టీడీపీ, బీజేపీ జెండాలు పట్టుకుని కూటమి గెలుపుకి పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.