ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల నగరం ఎడతెరపిలేని వర్షాలకు తడిసిముద్దవుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చరిత్రలో గతంలో ఎన్నడూలేనంతగా ఎగువ నుంచి వరద వస్తుండటంతో దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూగడుపుతున్నారు.
అథ్యాత్మికనగరంగా పేరుగాంచిన తిరుమల వరదలతో ఎందుకు అల్లాడుతోంది. గత 30 ఏళ్లలో ఇలాంటి వర్షం పడలేదంటున్న.. చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోవడానికి కారణాలేంటన్న చర్చ నడుస్తోంది.
మరోవైపు తిరుపతి ఎగువన 15 కి.మీ. వరకు కురిసే వాననీరు అంతర్గత కాల్వల ద్వారా నగరం వెలుపలకు వెళ్లాల్సి ఉంటుంది. పట్టణంలోని చాలా ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యాయి. తద్వారా వరద నీరు రోడ్లపైకి చేరి చెరువులను తలపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కపిలతీర్థం, మాల్వాడిగుండ నుంచి వచ్చే నీరంతా.. తిరుచానురు స్వర్ణముఖనదిలో కలుస్తుంది. ఇక్కడే ఉండే కాలువలు కుచించుకపోవడంతో.. ఈవరద నీటితో లోతట్టు కాలనీల మునిగిపోయాయనే వాదన తెరపైకి వచ్చింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో నాళాలు పూడిపోవడంతో పరిస్థితి భయానకంగా తయారైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇక తిరుమల గిరుల్లో కురిసిన వర్షంతో శివజ్యోతినగర్, యశోదానగర్, రైల్వే కాలనీ, మధురానగర్ తదితర కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఆక్రమణల్లో ఉన్న కాలువలను పునరుద్ధరిస్తే తప్ప నగరం ముప్పు నుంచి బయటపడే అవకాశం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.