అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ పరిస్థితికి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా.. తమకు ఎదరులేదు బెదురులేదు అనుకున్న టీర్ ఎస్ పార్టీకి దుబ్బాక, జీహెచ్ ఎంసీ , హుజురాబాద్ ఉప ఎన్నికలు షాకిచ్చాయి. వీటికి తోడు వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్రంపై సుంకాన్ని తగ్గించి.. ఇరకాటంలో పెట్టండంతో టీఆర్ ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. దీంతో జ్ఙానోదయం అయిన సీఎం కేసీఆర్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రాన్ని ఎకిపారేశా డు. అయినప్పటికి అతని మాటలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. అందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే.. రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్.. ప్రజల సమస్యలు చెప్పుకునే ధర్నా చౌక్ ను నిషేధించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్లో కూర్చోవడానికి సిద్ధమవడంతో ప్రతిపక్ష నేతలు దొరికిందే అదనుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.గతంలో చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఊదరగొట్టి.. ఇప్పుడు కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడమేంటని ఎద్దేవ చేస్తున్నారు. కేసీఆర్ తాను ప్రవేశపెట్టిన పథకాలన్ని కేంద్ర సర్కార్ను అడిగే పెట్టారా అని అడుగుతున్నారు.
అటు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ధర్నాపై విరుచుకుపడుతున్నారు . హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పాలించే ప్రభుత్వమే ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. ఇంటికి 10 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి ఒట్టు పెట్టించుకున్నా.. ప్రలోభాలకు లొంగకుండా హుజూరాబాద్ ఓటర్లు నిజాయతీగా తమకు ఓటు వేశారని అన్నారు. కేసీఆర్ నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజుల దగ్గర్లోనే ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.