Janasenaparty: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని కొణతాల జనసేన లో చేరే అవకాశం ఉంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి జనసేన తరుపున ఎంపీగా పోటీచేసే యోచనలో కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడుగా పేరున్న కొణతాల.. 1989 నుండి 1996 వరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడుగా.. 1991 నుండి 1996 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల కన్వీనర్‌గా పనిచేశారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో 2004 నుండి 2009 వరకు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, న్యాయ తదితర శాఖలకు మంత్రిగా కొణతాల రామకృష్ణ పనిచేశారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్‌ఆర్‌సిపి లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటి చైర్మన్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల అనంతరం వైఎస్‌ఆర్‌సిపి కి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున ఆ ప్రాంతం సమస్యలపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్కాకేజీ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తరాంధ్రలో, ఢిల్లీలో అనేక ఉద్యమాలు నిర్వహించారు.వెనుకడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కొణతాల రామకృష్ణ రాష్ట్ర హైకోర్టులో పిల్ ను సైతం దాఖలు చేశారు.