కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist)

………………………………………………..

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప జిల్లా రెడ్లు కూడా ఉండవల్లి బెదిరింపులను సీరియస్‌ గా తీసుకుంటారన్న మాట. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన ఈ తెలుగు నియోగ బ్రాహ్మణ మాజీ ఎంపీ మాటలు యూట్యూబ్‌ చానల్స్‌లో వింటుంటే ఒకప్పటి బెజవాడ మోడరన్‌ కేఫ్‌ దగ్గర సాయంత్రం పేపరు చదివి రాజకీయాలపై దంచికొట్టే బ్రాహ్మణ మేధావులు గుర్తుకొస్తారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ‘పునరుద్ధరణ’పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆసక్తి లేదని ఉండవల్లి విమర్శించడంతో ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గురువారం జవాబివ్వడం ఆయన అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు నచ్చలేదు. ఉండవల్లి స్థాయి నేతకు కామ్రేడ్‌ సజ్జల సమాధానం చెప్పడం ఏమిటని వారంతా ఒక్కసారి నివ్వెరపోయారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సుప్రీంతీర్పుతో సమైక్య రాష్ట్రం వస్తే తమ పార్టీకి సంతోషమేనని సజ్జల గారు చెప్పడంతో ఈనాడు పత్రిక కూడా వివరంగా ఆయన వార్త ప్రచురించింది. పదేళ్లు ఎంపీగా ఉన్న ఉండవల్లిపై గౌరవం ఉన్నా ఆయన సగటు రాజకీయ నాయకుడి తరహాలో సీఎం జగన్‌ పై పనిగట్టుకుని విమర్శిస్తున్నారని సజ్జల గారు నిన్నటి మీడియా సమావేశంలో అన్నారు. 

బ్రాహ్మణ విద్యార్థుల పరిశోధనకు అన్ని విధాలా అర్హుడు అరుణ్‌ కుమార్‌!

డాక్టర్‌ భోగరాజు పట్టాభిసీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్‌ టీవీఎస్‌ చలపతిరావు, కోన ప్రభాకరరావు, ద్రోణంరాజు సత్యనారాయణ రావు వంటి నియోగ బ్రాహ్మణ ఉద్ధండ నాయకుల వారసత్వాన్ని కాంగ్రెస్‌లో తాను కొనసాగించానని అనుకుంటున్న మేధావి–రాజకీయవేత్త ఉండవల్లి. ఆయన సగటు నాయకుడా, వీధి చివరి ‘స్ట్రీట్‌ స్మార్ట్‌’ మాటల మాంత్రికుడా అనేది తెలుగు బ్రాహ్మణ విద్యార్థులు పరిశోధన చేసి నిగ్గుతేల్చాల్సిన అంశం. ప్రస్తుతం 175 మంది సభ్యులున్న ఆంధ్ర అసెంబ్లీలో ఇద్దరే ఇద్దరు బ్రాహ్మణ సభ్యులున్నారు. వారిలో మల్లాది విష్ణువర్ధన్‌ (విజయవాడ సెంట్రల్‌) వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాగాని దివంగత కాపు కాంగ్రెస్‌ నేత వంగవీటి మోహనరంగారావు గారి శిక్షణలో ఎదిగారు. అవైదిక వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. ఇక రెండో నేత కోన రఘుపతి గారు పెద్దగా నియోగ తెలివితేటలు ప్రదర్శించని బాపట్ల ఎమ్మెల్యే. రెండున్నరేళ్లకు పైగా డెప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన రఘుపతికి తన తండ్రి మాజీ స్పీకర్, మాజీ మంత్రి, మాజీ తెలుగు సినిమా హీరో కోన ప్రభాకరరావు గారి మాదిరిగా జిత్తులమారి తెలివితేటలు లేవంటారు. ఇలాంటి పలుకూ పదునూ లేని తెలుగు బ్రాహ్మణ రాజకీయాల నేపథ్యంలో– వచ్చే శాసనసభ ఎన్నికల్లో అయినా ఉండవల్లికి పిలిచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ టికెట్‌ (రాజమండ్రి సిటీ) ఇస్తే కృష్ణా నది భగ్గుమంటుంది. కాపు కాంగ్రెస్‌ రాజకీయ నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు గారి తోడ్పాటుతో మొదట రాజకీయాల్లో తన ఉనికి చాటుకున్నారు ఉండవల్లి. 

రామోజీపై గౌరవ మర్యాదలు గుమ్మరించిన రాజమండ్రి మాజీ ఎంపీ..

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్వవహారంపై 2006 నవంబర్‌ మొదటి వారం  రామోజీరావు గారి గురించి మాట్లాడిన ప్రతిసారీ తెలుగు ‘మీడియా ముఘల్‌’పై ఏమాత్రం మర్యాద తగ్గకుండా కోస్తా మధ్య తరగతి బ్రాహ్మణ ఉద్యోగిలా వ్యవహరించారు ఉండవల్లి. ఆయన గతంలో ఈనాడు సంస్థల్లో పనిచేశారా? అనే అనుమానం వచ్చేలా ఉండేది ఉండవల్లి గారి పోకడ. ఈ మొత్తం కుంభకోణంపై విచారణ జరిగాక రామోజీ రావు గారు నిర్దోషిగా, ఆయన తెల్ల బట్టలపై చిన్న నల్ల మరక కూడా పడకుండా బయటపడాలని ఆకాంక్షిస్తున్నానని అరుణ్‌ కుమార్‌ చెప్పేవారు. మాలాంటి మామూలు జర్నలిస్టులకు ఉండవల్లి గారి మాట తీరు అత్యంత వినోదాత్మకంగా ఉండేది. రామోజీ నిర్దోషిత్వం నిరూపితమైతే–ఆయన సంస్థల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల బతుకులు భద్రంగా ఉంటాయని కూడా రాజకీయాలను ఒంటికి పైపూతగా పూసుకున్న ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేసేవారు. ఏదేమైనా కోస్తా జిల్లాల్లో జిత్తులమారి గోదావరి బ్రాహ్మణ నేత లేని లోటును అరుణ్‌ కుమార్‌ జీ చక్కగా తీరుస్తున్నారు. రాజమహేంద్రవరం అడ్డాగా సాగుతున్న ఆయన విన్యాసాలు అమరావతికి ఎప్పుడు చేరుకుంటాయా అని బెజవాడ సత్యనారాయణపురం, కృష్ణలంకలో కాపురముంటున్న సద్బ్రాహ్మణులు ఎదురు చూస్తున్నారు. ఉండవల్లికి చట్టసభ సభ్యుడిగా ప్రజాసేవ చేసే భాగ్యం ఎప్పుడు లభిస్తుందో మరి. అంతా ఏపీ ముఖ్యమంత్రి దయ!

Optimized by Optimole