వంటగ్యాస్ వినియోగ దారులకూ కేంద్రం గుడ్ న్యూస్. ఇకనుంచి తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రిఫిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే ఈ సేవలు పొందవచ్చు.
కరోనా రీత్యా వంట గ్యాస్ వినియోగదారులు పడుతున్న అవస్థలను చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ) జాబితా ప్రకారం తమ ప్రాంతంలో ఉన్న పంపిణీదారుల వద్ద గ్యాస్ రీఫిల్ చేసుకోవచ్చని పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండానే మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పోర్టబులిటీ చేసుకోవచ్చని తెలిపింది. కాగా అదే సంస్థకు చెందిన వేరే పంపిణీదారుడిని(డీలర్).. మార్చుకోవడానికే వినియోగదారులకు వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిని ఫైలట్ ప్రాజెక్టు కింద చండీగఢ్, కోయంబత్తూర్, గురుగ్రామ్, పుణె, రాంచీలలో ప్రారంభించనున్నారని కేంద్రం తెలిపింది. ఈ సేవను పొందాలంటే..?ఫోన్లోని యాప్/లాగిన్ ద్వారా ఎల్పీజీని బుక్ చేసినప్పుడు.. వినియోగదారులకు తమ ప్రాంతానికి చెందిన పంపిణీదారుల జాబితా కనిపిస్తుంది. ఆ పక్కనే వాటి రేటింగ్ కూడా ఉంటుంది. వాటి ఆధారంగా తమకు నచ్చిన పంపిణీదారులను ఎంపిక చేసుకోవచ్చు.అయితే ముందున్న పంపిణీదారుడు.. వినియోగదారులను సంప్రదించి ఒప్పించే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు నమ్మకం ఉంటే.. పోర్టబిలిటీ అభ్యర్థనను 3 రోజుల వ్యవధిలో ఉపసంహరించుకోవచ్చు. లేకపోతే.. వినియోగాదారుడు ఎంచుకున్న పంపిణీదారుకు కనెక్షన్ బదిలీ అవుతుంది. ఈ సౌకర్యం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.