ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హవా.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. గురువారం రాజస్థాన్ తో జరిగిన పోరులో గుజరాత్ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43 : 28 బంతుల్లో ), డేవిడ్ మిల్లర్‌ (31 : 14 బంతుల్లో ) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్‌ తలో వికెట్ పడగొట్టారు.
ఇక 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో 37 పరుగుల తేడాతో గుజరాత్ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జోస్ బట్లర్ (54 : 24 బంతుల్లో ) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ పడగొట్టారు.