peoplespulse: హర్యానా హస్తగతమే… పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!

Haryana elections2024:

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. సర్వే ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ తో అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

హర్యానాలో అధికారం చేపట్టాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ, తన ప్రత్యర్థి అధికార బిజెపిపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.

ఇక హర్యానాకి  కాబోయే సిఎం ఎవరు అన్న ప్రశ్నకు? సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నట్లు పీపుల్స్‌పల్స్‌ పేర్కొంది. ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉందని ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీల ప్రభావం అంతంత మాత్రమేనని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది.

ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కీలకపాత్ర పోషించినట్లు సర్వే సంస్థ ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు ఓటు వేసినట్లు..ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదని తెలిపింది. నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల… హర్యానాలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయని పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయినట్లు సంస్థ పేర్కొంది.