ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

Nancharaiah merugumala (senior journalist)

ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తే నేరం, ఇప్పుడు ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

అనుసూచిత కులాలు (ఎస్సీలు–దళితులు), అనుసూచిత జాతుల (ఎస్టీలు–ఆదివాసీలు) వారిని కులం పేరుతో కించపరిస్తే, దూషిస్తే… ఈ నేరం చేసినవారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. నరేంద్రమోదీ వంటి వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు చెందిన వ్యక్తిని ఇంటి పేరుతో తక్కువ చేసి మాట్లాడితే న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయని గురువారం గుజరాత్‌ నగరం సూరత్‌ లో రుజువైంది. 2019 లోక్‌ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ‘దొంగలందరికీ ఎందుకు మోదీ అనే ఉమ్మడి ఇంటిపేరే ఉంటోంది?’ అని ఎగతాళిచేశారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, మరో వ్యాపారి లలిత్‌ మోదీలు నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్‌ భయ్యా అలా మాట్లాడారు. దీంతో మోదీ కులానికే (మోధ్ ఘాంచీ) చెందిన  సూరత్‌ వెస్ట్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ అప్పట్లో రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా వేశారు. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలు వైశ్య కులానికి చెందిన మోదీలు. నరేంద్ర, పూర్ణేష్‌ లు ఓబీసీ మో«ద్‌ ఘాంచీ కులస్థులు. కింది కులాలవారిని కులం పేరుతో దూషిస్తే శిక్షార్హమైన నేరం అవుతుందని మాత్రమే ఇప్పటి వరకూ భారతీయులకు తెలుసు. సూరత్‌ కోర్టు నేడు ఇచ్చిన తీర్పుతో ఓబీసీలను సైతం ఇంటిపేరుతో కించిపరిస్తే…తొలి భారత ప్రధాని, కశ్మీరీ బ్రాహ్మణుడు పండిత జవాహర్లాల్‌ నెహ్రూ మునిమనవడైన రాహుల్‌ గాంధీని కూడా భారత చట్టాలు వదిలిపెట్టవని రుజువైంది. దొంగలకు మోదీ ఇంటిపేరు ఉంటుందన్నందుకు సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలుశిక్ష వేసింది.