×

Delhi Elections:
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచుకోటకు బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానాలతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అగ్రనేతలైన కేజ్రీవాల్, సిసోడియా ఎమ్మెల్యేలుగా ఎందుకు ఓడిపోయారో… ఆ పార్టీ కూడా అందుకే ఓడిపోయింది! ‘‘కర్ణుని చావుకు సవా లక్ష కారణాలు’’ ఉండచ్చేమోగానీ, కేజ్రీవాల్ ఓటమికి వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ కారణాలే ఉన్నాయి.
అధికారంలోకి రాకముందు ఆదర్శాలు మాట్లాడి, అధికారం వచ్చాక వాటికి విరుద్ధంగా వ్యవహరిస్త్తే… ప్రజలు తిరస్కరిస్తారని చరిత్ర ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రుజువు చేసింది. కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే జరిగింది! హర్యానాలో పుట్టిన కేజ్రీవాల్ ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదువుకుని, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యారు. రెవెన్యూ సర్వీసులో ఉండగానే 1999లో పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, ఢిల్లీ ప్రజలకు పన్నులతో పాటు ఇతర సామాజిక విషయాల మీద ఆయన అవగాహన కల్పించేవారు. సమచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని వెలికితీశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో రామన్ మెగసెసే అవార్డు లభించడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. దీంతో ఆయన మరింత విస్తారంగా, చురుగ్గా పని చేయడం మొదలుపెట్టారు. 2011లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ దీక్ష చేయడంతో దేశం దృష్టిని ఆకర్షించారు.


అరవింద్ కేజ్రీవాల్ అవినీతి మీద చేసే ప్రసంగాలు, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునేవి. ‘‘జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఏ పదవీ చేపట్టను. యాక్టివిస్టుగానే ఉంటా’’ అని ప్రకటించుకున్న కేజ్రీవాల్, అనూహ్యంగా 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే మిడిల్ క్లాస్ హీరోగా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్కి ఢిల్లీ ప్రజలు 2013లో 28 సీట్లు కట్టబెట్టడంతో కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కొంతకాలం ప్రభుత్వం సజావుగా సాగినా.. సంకీర్ణ ప్రభుత్వంలో స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నానని ఆయన రాజీనామా చేశారు. అనంతరం 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను ఆప్ పార్టీకి 67 సీట్లు ఇచ్చి ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కు బ్రహ్మారథం పట్టారు. తర్వాత విద్య, వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన అనేక పథకాలకు ఆకర్షితులైన ప్రజలు 2020 ఎన్నికల్లోనూ 62 సీట్లతో మళ్లీ ఏకపక్షంగా ఆప్కు అధికారం కట్టబెట్టారు. అయితే, గడిచిన ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. దాని పర్యావసనమే 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.

ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు. అయితే, ఇతర పార్టీలకు తాము భిన్నమని ప్రకటించుకున్న ఆప్ కూడా పదేళ్లు గడిచేసరికి ఫక్తు రాజకీయ పార్టీగానే ప్రజలకు కనిపించసాగింది. యాక్టివిస్టుగానే ఉంటా, రాజకీయాల్లోకి రానని చెప్పి, యూ టర్న్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినా కేజ్రీవాల్ని ఆదరించారు. సెక్యూరిటీ తీసుకోనని చెప్పిన కేజ్రీవాల్ మొదటిసారి మెట్రోలో వచ్చి ప్రమాణస్వీకారం చేసినప్పుడు ‘‘వా.. సీఎం అంటే ఇలా ఉండాలి’’ అని ప్రజలు నీరజనాలు అందుకుని, తర్వాత యూ టర్న్ తీసుకుని సెక్యూరిటీ తీసుకుంటే… ఆ ప్రజలే ప్రోటోకాల్ కదా? అని సర్థుకున్నారు. తాను సామాన్యుల సీఎంనని, ప్రభుత్వ బంగ్లా తీసుకోనని చెప్పి, ఖరీదైన శీష్మహల్ నిర్మించుకోవడాన్ని మాత్రం ప్రజలు అంగీకరించలేకపోయారు. సీఎం చిన్న ఇంట్లో ఉండాలని ఎవరూ అనరుగానీ, కోట్లు ఖర్చు పెట్టి ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఊరుకోలేకపోయారు. ఈ అంశాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా ‘కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ కాదు, కాఫీ ఆద్మీ’ అని ప్రచారం చేసి ఆప్ పడవకు తూట్లు పొడిచింది.


తానొక ఐఐటీయన్ అని, తమది ఎడ్యుకేటెడ్ పార్టీ అని కేజ్రీవాల్ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అవినీతికి వ్యతిరేకంగా వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ, దీనికి విరుద్ధంగా ఆయనతో పాటు ఆయన మంత్రులు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో విశ్వసనీయత కోల్పోయారు. 2022లో సత్యేంద్ర జైన్ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. అదే సంవత్సరం మద్యం పాలసీ కుంభకోణంలో ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టయ్యారు. చివరికి ఆ ఉచ్చు కేజ్రీవాల్ మెడకు కూడా చిక్కుకుంది. కానీ, ఈ కేసులో సీబీఐ విచారణ అడ్డుకోవడానికి కేజ్రీవాల్ అనేక ప్రయత్నాలు చేశారు. అవినీతి ఆరోపణలు వస్తే నాయకులు రాజీనామా చేయాలని చెప్పిన కేజ్రీవాల్, తాను జైల్లో ఉన్నా రాజీనామా చేయలేదు. సిసోడియాని అరెస్టు చేయగానే, రాజీనామా చేయించిన కేజ్రీవాల్, తను జైల్లో ఉండి కూడా చాలాకాలం కుర్చీని వదల్లేదు. దీంతో అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి పార్టీగా మారిందని విమర్శించిన బీజేపీ ఆర్ఎస్ఎస్తో కలిసి పక్కా ప్రణాళికలతో బూత్ స్థాయి నుండి అవినీతిపై ప్రచారం చేసి ఆప్ ప్రతిష్టను దెబ్బ తీశాయి.
కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు రాజీనామా చేయకుండా బెయిల్పై విడుదలయ్యాక రాజీనామా చేసి, కీలుబొమ్మ లాంటి అతీశీని సీఎం చేయడం ఒక నాటకంలా ప్రజలు భావించారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కుర్చీలోంచి మీడియాతో మాట్లాడేవారు. అదే కుర్చీని కేజ్రీవాల్కు గౌరవం పేరుతో ఖాళీగా వదిలేసి అతీశీ మరో కుర్చీలో కూర్చోవడం తీవ్ర విమర్శలు దారి తీసింది. దీన్ని అతీశీ గౌరవమనుకుంటే, ప్రజలు మాత్రం ‘అతి’ అనుకున్నారు. రాజకీయ కక్షతోనే అరెస్టులు చేశారని, తాము బీజేపీ బాధితులమని ఆప్ చేసిన ప్రచారం ప్రజలకు నచ్చలేదు. ఆప్ నేతలు ఒకవైపు కేసుల్లో ఇరుక్కోవడం, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆప్ అంతకముందు ఐదేళ్లలో చేసినట్టుగా ఈసారి పరిపాలించలేకపోయింది. 2020 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాగీతాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలో గాలి కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. యమునా నది ప్రక్షాళన కలగానే మిగిలిపోయింది. దీంతో కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత మరింత పెరిగింది.

మధ్యతరగతి హీరోగా గుర్తింపు పొందిన కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో వారి మద్దతు కూడా కోల్పోయారు. గతంలో కేజ్రీవాల్ తీసుకొచ్చిన ఉచిత పథకాలను వ్యతిరేకించడం వల్ల బీజేపీ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ఓట్లను కోల్పోయింది. దీనిని గ్రహించిన బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తామని చెబుతూనే, మరిన్ని ఉచిత పథకాలను జతచేసి మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి తోడు ఎన్నికల ముందు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని చేసిన కీలక ప్రకటన మధ్య తరగతిని బీజేపీ వైపు తిప్పింది. దీంతో ఉద్యోగులు అధికంగా ఉండే న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓటమికి కూడా కారణమైంది.
2015,2020 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఢిల్లీలో తనకు ఎదురేలేదని భావించిన కేజ్రీవాల్ అతివిశ్వాసంతో దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. పంజాబ్ విజయంతో ఈ అతివిశ్వాసం మరింత మితిమీరింది. గోవా, గుజరాత్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీతో కలవనని చెప్పిన కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల సమయంలో మాటమార్చి ‘ఇండియా’ కూటమితో కలిశారు. ఆరు నెలలు తిరగకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో తెగదింపులు చేసుకోవడంతో రెండు పార్టీలు ఎవరికి వారే పోటీ చేశారు. ఢిల్లీలో ఈసారి దాదాపు 6 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్, చాలా చోట్ల ఓట్లను చీల్చి ఆప్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా, ముస్లిం, ఎస్సీ ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పడటంతో బీజేపీకి కలిసొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడంతో ఆయనకు క్రేజ్ తగ్గిందా..? అనే చర్చలు ప్రారంభమయ్యాయి. తన 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు తన నిర్ణయాలను తానే మార్చుకుంటూ యూ టర్నులు తీసుకోవడం, తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తానే వ్యవహరించడం వంటి చర్యలు ఢిల్లీలో ఆప్ ఓటమికి దారి తీశాయి. కేజ్రీవాల్కు మళ్లీ క్రేజ్ పెరిగడంతోపాటు ఆప్కు ఆదరణ పెరగాలంటే ఆయన గతంలోవలే ఢిల్లీలోని కాలనీలు, గల్లీలు, మొహల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయితే, మరో ఐదేళ్లలో ఆయనకు, ఆప్కు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి.


-జి.మురళీ కృష్ణ,
సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all
Optimized by Optimole