కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో..సెప్టెంబర్ 16న బీజేపీ నేతలతో షా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించనున్నారు. అనంతరం హీరో ప్రభాస్ తో షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా ఇటీవల మునుగోడు సభకు హాజరైన అమిత్ షా… జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆతర్వాత బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన సభ అనంతరం .. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హీరో నితిన్ తో ప్రత్యేకంగా సమావేశం అయిన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల భేటీ పై ఎటువంటి స్పష్టత రానప్పటికి.. ప్రభాస్ తో భేటీ మాత్రం ఓదార్పులో భాగమేనని బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం.