Nancharaiah merugumala senior journalist:
భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటేయడం ఎవరికీ మంచిది కాదు!అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో బాజపాకు ఓట్లేస్తే నష్టం బ్రామ్మలకే!
భారత నూతన పార్లమెంటు (సన్సద్) భవనం ప్రారంభం సందర్భంగా జరిగిన వేడుకలో లోక్ సభ వేదికపై వరుసగా (కూర్చున్న) రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ ఫోటో చూస్తే– స్వతంత్ర భారత చరిత్రలో ఇంతటి గొప్ప సందర్భంలో కీలకమైన కేంద్ర చట్టసభ వేదికపై ఒక్క బ్రాహ్మణ నాయకుడు కూడా లేకపోవడం బీజేపీ హయాంలో దేనికి సంకేతం? హరివంశ్ బిహార్ జనతాదళ్–యూకు చెందిన క్షత్రియ (ఠాకుర్ లేదా రాజపూత్) నాయకుడు, మాజీ జర్నలిస్టు. మోదీ సంగతి తెలిసిందే (గుజరాత్ కు చెందిన ఓబీసీ కులం మో«ద్ ఘాంచీ తేలీ). మూడో వ్యక్తి ఓం బిర్లా రాజస్థాన్ కు చెందిన వైశ్య ఉపకులం మాహేశ్వరీ వర్గంలో పుట్టిన నేత. మరోపక్క ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి అనేక హిందీ రాష్ట్రాలు. కర్ణాటక వంటి దక్షిణాది రాజ్యాల్లో బ్రాహ్మణులు గత పదేళ్లుగా ప్రతి ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువగా ఓట్లేస్తున్నారు. ఈ వాస్తవాన్ని అనేక పోలింగు అనంతర సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అత్యంత విశ్వసనీయమైన సీఎస్‌డీఎస్ (సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) జరిపిన పోస్ట్ పోల్ సర్వేలన్నీ దేశంలో 3 శాతం జనాభా ఉన్న బ్రాహ్మణ ఓటర్లు దాదాపు 80 శాతానికి పైగా బీజేపీకి ఓట్లేసిన విషయం వెల్లడిస్తున్నాయి.
నయా భారతంలో కొత్త ముస్లింలు బ్రామ్మణులేనా?
పైన చెప్పినట్టు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లోని బ్రాహ్మణులు ఈమధ్య ప్రతిసారీ అత్యధిక సంఖ్యలో కాషాయపక్షం బీజేపీకే ఓట్లు గుద్దిపారేస్తున్నారు. అంటే మూడు దశాబ్దాల క్రితం వారు ఎలా కశ్మీరీ పండిత (బ్రాహ్మణ) కుటుంబ సభ్యుల పెత్తనంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా పేద్ద సంఖ్యలో ఓట్లు వేసేవారో ఇప్పుడు బీజేపీ కమలానికి అంతే శ్రద్ధతో ఓట్లు పడేలా చూసుకుంటున్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ముస్లింలు దాదాపు 80 శాతానికి పైగా బీజేపీకి వ్యతిరేకంగా ఏదో ఒక బలమైన పార్టీకి ఓట్లేస్తున్నారని ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా నిరూపించాయి. అలాగే, ఈ దక్షిణాది రాష్ట్రంలో దాదాపు రెండు మూడు శాతం జనాభా ఉన్న బ్రాహ్మణులు అప్పటి పాలకపక్షమైన బీజేపీకే దాదాపు అత్యధిక సంఖ్యలో ఓట్లేశారు. ఇలా ఎన్నికల్లో ముస్లింల దారిలో ఈ హిందూ బ్రామ్మలు పయనిస్తూ మూకుమ్మడిగా ఒకే పార్టీకి (బీజేపీకి) ఓట్లేయడం కొత్త పరిణామమేగాక, ఇది బ్రామ్మణులకు రాజకీయంగా నష్టదాయకం. ఓ పక్క ముస్లింలు 1950లు, 60లు, 70ల వరకూ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులుగా ఉన్నారు. ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం చెప్పుచేతల్లో నడిచారు. చివరికి నష్టపోయారు. ఇంత బాగోతం తెలిసి కూడా తమకు అంతగా ప్రేమ లేని ముస్లింల దారిలో భారతీయ బ్రాహ్మణులు పరుగులు తీయడం (ఓకే రాజకీయపక్షానికి మూకుమ్మడిగా కొమ్ముకాయడం) భారత ప్రజాస్వామానికి మంచిది కాదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నాణ్యతను ఇలాంటి ముస్లిం, బ్రాహ్మణ సామాజికవర్గాల ఓటింగు పోకడలు దెబ్బదీస్తాయని ప్రసిద్ధ జర్నలిస్టు దిలీప్ మండల్ అభిప్రాయపడ్డారు. ఆయన ఈ విషయంపై ‘ద ప్రింట్’ న్యూజ్ వెబ్సైటులో నిన్న వ్యాసం కూడా రాశారు. ఉత్తరాదిన బ్రాహ్మణులు ఇలా కట్టుబానిసల మాదిరిగా బీజేపీకి ఓట్లేస్తున్న కారణంగా ఇప్పుడు ఈ కాషాయపక్షం అధికారంలో ఉన్న ఏ హిందీ రాష్ట్రంలోనూ బ్రాహ్మణ నేత ముఖ్యమంత్రిగా లేరు. ఎక్కడో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రమే సీఎం పదవి బ్రాహ్మణ నేతకు (అదీ కాంగ్రెస్ నుంచి కాషాయ తీర్థం పుచుకున్న హిమంతా బిశ్వ శర్మా) ఇచ్చింది బీజేపీ. బ్రాహ్మల జనాభా ఆరేడు శాతం ఉన్న ఉత్తరప్రదేశ్ లో సైతం బ్రాహ్మణ నేతకు సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్ధంగా లేదు. అక్కడ బ్రామ్మణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నా వారికి మంత్రి పదవులు ఇచ్చింది కూడా చాలా తక్కువే. అలాగే, దాదాపు బ్రామ్మలు అత్యుత్సాహంతో బీజేపీకి ఓటేసిన కారణంగా కర్ణాటక తొలి బ్రామ్మణ ముఖ్యమంత్రి ఆర్. గుండూరావు కొడుకు, పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేశ్ గుండురావుకు తొలి విడత మంత్రి పదవి ఇవ్వడానికి ఒక్కళిగ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ నేత డీకే శివకుమార్ వ్యతిరేకించి అడ్డుకున్నారు. చివరికి, సీఎం సిద్ధరామయ్య చొరవతో రెండో విడత దినేశ్ కు కేబినెట్లో స్థానం లభించింది. ఓబీసీ కురుబ కుటుంబానికి చెందిన లోహియావాది సిద్ధరామయ్య ఓ బ్రాహ్మణ నేతకు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వడం చూస్తే చాలా మందికి జాలి వేస్తోంది. బ్రాహ్మణుల మూక మనస్తత్వం వారిని ఈ స్థాయికి దిగజార్చింది. భవిష్యత్తులో ఏ పరిణామాలకు ఇది దారితీస్తుందోనని కొందరు బ్రాహ్మణ బుద్ధిజీవులు దిగులు పడుతున్నారు. ఏదేమైనా కాస్త దైవభక్తి ఎక్కువగా ఉండే భారతీయ ముస్లింల దారిలో విశాల బ్రాహ్మణ సమాజం పయనించడం దేశానికి కూడా మంచిది కాదు. ప్రతి కులంలోని సభ్యులు అన్ని పార్టీలకూ ఓట్లేస్తేనే ప్రజాస్వామ్య పరిఢవిల్లుతుందని పాశ్చాత్య రాజకీయ పండితులు సైతం చెబుతున్నారు.