PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తోడబుట్టిన చెల్లిని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు…? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు…? తండ్రి హత్య దోషులెవరో తేలాలని అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్న మరో చెల్లి సునీతకి ప్రాణ హాని ఉందని భయపెట్టేవారికి మద్దతు ఇస్తున్న వాడు సవ్యసాచి ఎలా అవుతాడు…? పవన్ ప్రశ్నించారు. జగన్ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. మేమేదో ఆయనను ఇబ్బందిపెడుతున్నట్లు, విపక్ష నాయకులను కౌరవులతో పోలుస్తూ తాను అర్జునుడు అంటూ తనకు తానే చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.. ఇక్కడ అర్జునులు ఉండరు, కృష్ణులు ఉండరు..నేను పవన్…. ఆయన జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇష్టానుసారం హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు.
ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో “ఓడిపోతున్నాను అనే బాధ జగన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఆయన పడుతున్న వేదన వర్ణణాతీతమని.. తాను అర్జునుడు అంటూ ప్రజలు ఆయుధాలుగా మారాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. ఎవరు దోపిడీదారులో, ఎవరు అవినీతిపరులో ప్రజలకు స్పష్టంగా తెలుసని.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. ఇక్కడ ఎవరి స్వగతాలు అవసరం లేదని.. నేను ఎప్పుడూ జగన్ ను తగ్గించి మాట్లాడలేదని గుర్తు చేశారు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వలేనివాడు, ఆమెను ఇష్టారీతిన తిట్టించేవాడు మన ఇంట్లోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ ఇస్తాడో ఆలోచించాల్సిన అవసరం ఉందని పవన్ సూచించారు.
“పవర్ స్టార్ కాదు … ప్రజా కూలీ”
తనను పవర్ స్టార్ అని పిలిస్తే అంతగా నచ్చదన్నారు జనసేనాని. తన ప్రమేయం ఉండే సినిమాల్లో పవర్ స్టార్ అని పేరు వేయడానికి కూడా ఇష్టపడనన్నారు. దేశం కోసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు.. పని చేస్తాడు అని ప్రజలు తమ మనసుల్లో అనుకునే దానికంటే పెద్ద బిరుదు ఏం ఉంటుందని తెలిపారు. సినిమాల్లో కూడా పవర్ స్టార్ అనే పదం అంతగా నచ్చదన్నారు. పవర్ స్టార్ అనే కంటే ప్రజా కూలీ అని పిలిస్తే చాలా ఆనందిస్తానని పవన్ పేర్కొన్నారు.