Loksabhaelections:2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!

Nancharaiah merugumala senior journalist:

” 2024 పార్లమెంటు ఎన్నికల్లో తన బలం 52 నుంచి 72 సీట్లకు చేరితే ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!”

కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ జీ సర్కారు హయాంలో జరిగిన మొదటి (2009) లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ బలం 145 (2004) సీట్ల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ డాక్టర్ సాబ్ పాలన చివర్లో జరిగిన 16వ లోక్ సభ ఎలక్షన్లలో (2014) కాంగ్రెస్ బలం రికార్డు స్థాయిలో 44 సీట్లకు పడిపోయింది. తన రెండో పదవీకాలం  చివర్లో (2013) తాను అమెరికా పర్యటనలో ఉండగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తనను న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ మీడియా సమావేశంలో ఆవమానించే రీతిలో వ్యవహరించారు. యూపీఏ-2 సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీని రాహుల్ భయ్యా నిట్ట నిలువుగా చింపి ముక్కలు చేది పారేశారు. మనసు తీవ్రంగా గాయపడిన మన్మోహన్ జీ రాహుల్ పై ప్రతీకారాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా తీర్చుకుని కాంగ్రెస్ బలం కనిష్ఠ స్థాయికి పడిపోయేలా కుట్రచేశారని చాలా మంది కాంగ్రెస్ నాయకులకు అనుమానం. 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంల పై విశ్వాసం పెంచుకున్న కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయంతో పూర్తిగా ఈ యంత్రాలపై పోయింది. 2019 ఎన్నికల్లో బలం 44 నుంచి 52 సీట్లకు పెరగడంతో ఈవీఎంలపై కాంగ్రెస్ విశ్వాసం కొద్దిగా పెరిగింది. రేపు 2024 పార్లమెంటు ఎన్నిక్షల్లో తన బలం 52 నుంచి 72 స్థానాలకు పెరిగితే…ఎలక్ట్రానిక్ ఓటింగ్ మాషీన్లపై కాంగ్రెస్ నమ్మకం మరి కాస్త పెరుగుతుందనడంలో సందేహం లేదు.