Nancharaiah merugumala: (senior journalist)
ఓబీసీ ప్రధాని మోదీకి ఐదుసార్లు వెల్కం చెప్పి, వీడ్కోలు పలికిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానికి ఎంతటి గౌరవం!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కులానికి ‘పెద్ద పద్మనాయకుడే’ (వెలమ) అయినా బాధ్యతగల ప్రజానాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీతో ఏడాది క్రితం చెడినాక ఆయనకు హైదరాబాద్ హవాయీ అడ్డాలో తన తరఫున స్వాగతం పలికే పని తనకు ఇష్టమైన ఓబీసీ (పశుసంవర్ధక శాఖ) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కే ఐదోసారి కూడా శనివారం అప్పగించారు కల్వకుంట్ల. ఈ ప్రొటొకాల్ పనిని తన కేబినెట్ లోని చిన్న పద్మనాయకులైన కొడుకు కేటీఆర్, మేనల్లుడు తన్నీరు హరీష్ రావు, మరో వెలమ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అప్పగించలేదు ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి విమానం దిగే ఎయిర్ పోర్ట్ ప్రాంతం అంతర్భాగంగా ఉన్న సనత్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గెలిచిన తలసానికి 2023లో కూడా ఈ సదవకాశం ఇవ్వడం బీజేపీవారికి కూడా చూడడానికి బాగుంది. కిందటేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వస్తున్న నరేంద్రభాయ్ మోదీకి తాను స్వయంగా వెల్కం చెప్పడం ఇష్టంలేక ప్రధాని పర్యటనకు కొద్ది రోజలు ముందు తలసానికి ఈ గొప్ప బాధ్యత అప్పగించడదానికి తగిన అర్హతలు కల్పించారు కేసీఆర్. ప్రధానిని సాదరంగా ఆహ్వానించడానికి వీలుగా తలసానిని తెలంగాణ ‘మినిస్టర్ ఇన్ వెయిటింగ్’గా 2022 ఫిబ్రవరి మొదటివారమే కేసీఆర్ నామినేట్ చేశారు. ఫలితంగా, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసానికి ప్రధానికి ఆహ్వానం పలకడంతో పాటు, పర్యటన పూర్తయ్యాక ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికే మహద్భాగ్యం కూడా ముఖ్యమంత్రి కల్పించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ పై గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ఏడాది తిరగకుండానే తన పూర్వ కేబినెట్ కలీగ్ అయిన కేసీఆర్ మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా చేరారు. తన సనత్ నగర్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలోనే ఉన్న బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడి నుంచే దిల్లీ విమానమెక్కే ప్రధానమంత్రికి స్వాగతం, వీడ్కోళ్లు పలికే అవకాశం తలసాని ‘ఆలుగడ్డ’ యాదవ్ గారికి రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. తమిళ బీసీ కుటుంబంలో పుట్టిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో గొడవపడిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ తొలి బీసీ ప్రధాని మోదీకి స్వాగతం పలికి, బేగంపేటలో వీడ్కోలు పలికే బాధ్యతను తెలుగు ఓబీసీల్లో కాస్త పైకొచ్చిన కులమైన ఎర్రగొల్ల కుటుంబంలో పుట్టిన తలసానికి ఇవ్వడం మంచిదే. ఉమ్మడి ఏపీలో ఆధిపత్యం చెలాయించిన జాతీయపక్షం కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు యాదవ చట్టసభ సభ్యులకు వారి కులానికి సంబంధించినదని అప్పట్లో పరిగణించిన పశుసవర్ధకశాఖ ఇచ్చేది. ఇప్పుడు అదే పద్ధతిలో తలసానిని యానిమల్ హస్బండ్రీ శాఖలోనే కేసీఆర్ గారు చాలా ఏళ్లుగా కూర్చోబెట్టడం మాత్రం చాలా బాగోలేదనే చెప్పాలి.