హుజరాబాద్ ఉప సమరం పై పార్టీల కసరత్తు!

తెలంగాణ రాజకీయం అంతా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక మీదే కేంద్రీకృతమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్గా తీసుకున్నాయి. బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థిత్వం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పై ఎన్నికల సమావేశమైంది. ఈ మేరకు ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా పార్టీలో అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బిజెపి అభ్యర్థి జిల్లా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టగా.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ఇంతవరకు తెలియరాలేదు.
కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంటి..?
ఇక టిఆర్ఎస్ అభ్యర్థిగా.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి పేరు వినిపించినా,
ఫోన్‌ సంభాషణల వ్యవహారం బహిర్గతం కావడం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టింది. ఫోన్‌ సంభాషణ లీక్‌ అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని భావించినప్పటికీ, ఏవో కారణాల వల్ల వీలు కాలేదు. ఎప్పుడైతే ఫోన్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందో.. ఆ తరువాత మంత్రులు, ముఖ్య నాయకులు ప్రచారానికి కూడా హుజూరాబాద్‌ వైపు వెళ్లకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినా, పార్టీ టికెట్టు ఇస్తారా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్‌ పార్టీలో చేరితే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయంలో టీఆర్‌ఎస్‌ ఇంటలిజెన్స్‌ విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. కౌశిక్‌రెడ్డి ఫోన్‌ సంభాషణల లీక్‌తో పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిందా? ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారా.. అభ్యర్థిని చూశా? అనే విషయమై అధిష్టానం దృష్టి పెట్టింది. కౌశిక్‌రెడ్డి కాకపోతే ఈటలను ఢీకొట్టే గట్టి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కూడా అధిష్టానానికి స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ సంభాషణతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగల అవకాశాలకు కౌశిక్‌రెడ్డి స్వయంగా గండి కొట్టుకున్నట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
ఎల్‌.రమణ పోటీ చేసే అవకాశం..?

తెలంగాణ టిడిపి మాజీ అధ్యక్షుడు రమణ ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అధికార టిఆర్ఎస్ లో చేనేత వర్గానికి చెందిన నాయకుడు లేడనే లోటు రమణతో భర్తీ అయింది. గతంలో ఈ వర్గం నుంచి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రమణ విషయంలో త్వరలోనే గుడ్‌ న్యూస్‌ వింటారు. ఆయనకు తగిన పదవి ఇస్తా’ అని ఎల్‌.రమణ పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్‌.రమణకు హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా! అనే చర్చ మొదలైంది. అయితే.. జగిత్యాలకు చెందిన ఎల్‌.రమణ స్థానికేతర అభ్యర్థి కావడం మైనస్‌ అవుతుందని, ఆయన ద్వారా చేనేత, బీసీ వర్గం ఓటర్లను ఆకర్షించాలని పార్టీ భావిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

కాంగ్రెస్ నుంచి ఈటలకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆయన కొద్ది రోజుల క్రితం కమలాపూర్ మండలంలో ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంతలోనే పీసీసీలో మార్పు జరగడంతో కొత్త సారథిగా రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఫోన్ లీక్ వ్యవహారం బహిర్గతం అవ్వడం.. పార్టీకి రాజీనామా చేయడం.. ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం మరోసారి చర్చనీయాంశం అయింది.
కాగా హుజురాబాద్ కు చెందిన కిసాన్ సెల్ కరీంగనర్ జిల్లా శాఖ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొల్నేని సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డిని కలిసి హుజురాబాద్ నుంచి పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తుల్లో పత్తి కృష్ణారెడ్డి ఉన్నారు. వీరిద్దరికి బదులు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను బీసీ కోటాలో ఈటలపై పోటీ పెడితే ఎలా ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ లో జరిగినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఇటీవల పొన్నంను కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చినట్లు సమాచారం. అయితే పొన్నం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో.. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు గట్టిపోటీ ఇచ్చే వ్యక్తి కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్.

Optimized by Optimole