దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!

Nancharaiah merugumala (senior journalist):

ఇందిరకు కాలేజీ డిగ్రీ లేకున్నా ఫరవా లేదు, పండిత నెహ్రూ కూతురు కాబట్టి!ఎచ్‌.డీ.దేవెగౌడ ఎల్సీఈ చదివినా నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఒక్కళిగ!దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!

మొన్నీ మధ్య దిల్లీ రాజఘాట్‌ వద్ద నెహ్రూ–గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, ‘‘ నా అన్న రాహుల్‌ గాంధీ కేంబ్రిజ్, హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవి, ఉన్నత పట్టాలు సంపాదించాడు. కాని గిట్టని రాజకీయ శత్రువులు భయ్యాని ‘పప్పూ’ అని ఎగతాళి చేస్తున్నారు,’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యమ్మ ఇందిర, నాయన రాజీవ్‌ గాంధీల హత్యల నేపథ్యంలో ప్రాణభయంతో రాహుల్‌ మారుపేర్లతో అమెరికాలో చదివారు. తప్పులేదు. రాహుల్‌ డిగ్రీ గురించి ఎవరూ అడగపోయినా ఆయన చెల్లి పైన చెప్పినట్టు దెప్పిపొడవడం ఈ కుటుంబ స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది. ఏ వ్యక్తి మాటలు, చేతలు, రాతలు చాలా వరకు ఆ వ్యక్తి చదువును ప్రతిబింబిస్తాయి. మరి రాహుల్‌ మాటలు వింటే కేంబ్రిజ్, హార్వర్డ్‌ మెటీరియల్‌ అనిపించడు. సరే, ఇదంత సీరియస్‌ విషయం కాదు. ఎందుకంటే భారత ఫస్ట్‌ ఫ్యామిలీకి ఇతరులకు లేని ప్రత్యేక హక్కులు ఉంటాయి. అవి అందరికీ కనిపించవు, వర్తించవు. ఇక ప్రియాంక, రాహుల్‌ నాయనమ్మ ఇందిరా ప్రియదర్శిని బ్రిటిష్‌ కాలేజీలో చదివినా కోర్సులు పూర్తిచేయలేదు. డిగ్రీ పట్టాలు సంపాదించలేదు. ఆమె అనారోగ్యం దీనికి కారణం. అయినా, ఇందిరమ్మ కశ్మీరీ బ్రాహ్మణ పండితుడు పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ ఏకైక సంతానం, మోతీలాల్‌ నెహ్రూ మనవరాలు కాబట్టి ఆమె ఓ నియంతలా దాదాపు 16 ఏళ్లు భారత ప్రధానిగా రాజ్యమేలినా ఆమెకు కాలేజీ డిగ్రీ లేదే అని ఏ తెలుగు బ్రాహ్మణ బుద్ధిజీవీ ప్రశ్నించడు. ముఖ్యంగా తెలంగాణ శ్రీవైష్ణవ బ్రాహ్మణ బుద్ధిజీవి గాని, జిత్తులమారి కోస్తాంధ్ర జిల్లాల నియోగి బ్రాహ్మణ మేధావికి కూడా ఇదో పెద్ద విషయం కాదు. అట్లుంటది మన తెలుగోళ్లతో వ్యవహారం.

ఇకపోతే, 1996–97లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు, తెలుగు తొలి ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారి మద్దతు ఉన్నా ఏడాది కూడా ప్రధాని పదవిలో కూర్చోలేకపోయారు ఎచ్‌.డీ.దేవెగౌడ. ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్న 324 రోజుల్లో ఏ ఒక్క తెలుగు మేధావి గాని, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి హరియాణ్వీ అగ్రవాల్‌ గాని దేవెగౌడ కేవలం ‘డిప్లమాహోల్డరే’ అని కన్నీళ్లు పెట్టుకోలేదు. మరి, పెద్ద బ్రామ్మలు, బలిసిన ఉత్తరాది వైశ్యుల బలగం వెనకున్న పార్టీ బీజేపీ తరఫున రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో భారత ప్రధాని అయిన గుజరాతీ మో«ద్‌ ఘాంచీ  ఓబీసీ నాయకుడు నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ తాను ‘సుదూర విద్య’తో డిగ్రీ, పీజే చదువులు పూర్తిచేసి, పట్టాలు సంపాదించానని ప్రకటించుకున్నాడు. మరి బహిరంగంగా వెల్లడించిన పాపానికి ఆ డిగ్రీ కాపీలు చూపించాలని చదువులు బలిసిన కొందరు బ్రాహ్మణోత్తముల నేతృత్వల నేతృత్వంలో ఉత్తరాది అగ్రవాల్స్, దక్షిణాది బ్రాహ్మన్స్‌ పట్టుపడుతున్నారు. గుజరాత్‌ హైకోర్టు తీర్పు తర్వాతైనా–ఇందిరాగాంధీ, దేవెగౌడల సదువులు, వారి కున్న పట్టాలు ఏమిటో తెలుసుకుని గుజారాతీ తేలీ ప్రధాని తాను పుట్టినప్పటి నుంచీ ఏ చదివిందీ దిల్లీలో మీడియా సమావేశం పెట్టి చెబితే మంచిది. ఆ పనిచేస్తే కోట్లాది మంది భారత ఓబీసీలు, దళితులు ఎక్కువ సంతోషపడతారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే మొదటి నుంచీ అసలు కాలేజీ మెట్లక్కని తెలుగోళ్లకు సైతం చాలా లోకువ. మరి దాదాపు 9 ఏళ్లుగా భారత ప్రధానిగా ఉన్న నరేంద్రభాయ్‌ మోదీ కూడా దూర విద్యతో రెండు డిగ్రీలు సంపాదించారంటే పీవీ నరసింహారావు దయతో ‘పైకొచ్చిన’ బుద్ధిజీవులకు సైతం చాలా తేలికే. ఏదేమైనా కరీంనగర్‌ కే చెందిన మరో తెలుగు బిడ్డ దివంగత ప్రొఫెసర్‌ గడ్డం రామ్‌ రెడ్డి గారు ఇప్పుడు బతికుంటే చాలా బాధపడేవారేమో మరి.  బహుభాషాకోవిదుడు, నిజాయితీకి మారుపేరైన పీవీ నరసింహారావు గారిని దేశానికి ప్రధానిగా బహుకరించిన పది కోట్ల తెలుగోరికి ఏ ఇతర ప్రధాని అయినా నిరక్షరాస్యుడిగానే కనపడతాడు.

You May Have Missed

Optimized by Optimole