కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్‌ ఇంగ్లండ్‌ ప్రధానైతే..?

nancharaiah merugumala (సీనియర్ జర్నలిస్ట్)

బ్రాహ్మణ స్త్రీ కూతురు కమల అమెరికా ఉపాధ్యక్షురాలైతేనే సంబరపడ్డాం!
మరి కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్‌ ఇంగ్లండ్‌ ప్రధానైతే….
––––––––––––––––––––––––––––––––––––––––––––
తమిళ బ్రాహ్మణ డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ కూతురు కమలా హ్యారిస్‌ 2020 ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కొందరు భారతీయులు సంబరపడ్డారు. 2022 జులై మాసంలో ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (అదే ఇంగ్లండ్‌ అధికారిక నామం) ప్రధానమంత్రిగా కన్నడ బ్రాహ్మణ దంపతులు సుధ, నాగవార రామారావు (ఎన్‌ ఆర్‌) నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌ ఎన్నికైతే వీపులు సవరించుకునే భారతీయులు ఎంత మంది ఉంటారో?
పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టిన రిషి సునక్‌ బ్రాహ్మణుడనే విషయం ఇంకా తేలకపోవడంతో ఆయన బ్రాహ్మణ అల్లుడు అని చెప్పాల్సివచ్చింది. రిషి గతంలో ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో తాను ఆచరణాత్మక హిందువునని ధైర్యంగా చెప్పాడు. అంతేకాదు, బ్రిటిష్‌ హౌసాఫ్‌ కామన్స్‌ సభ్యుడిగా భగవద్గీతపై ప్రమాణం చేశాడు. అమెరికాలో అయితే, క్రైస్తవేతరులు దేశాధ్యక్ష పదవికి ఎన్నికవడం కుదిరే పని కాదనే అర్ధంలో మాట్లాడుతూ, తాను బ్రిటిష్‌ ప్రధాని కావడానికి అడ్డంకులు లేవనే విషయం పరోక్షంగా చెప్పాడు. ‘‘నేను జనాభా లెక్కల సేకరణకు వచ్చిన అధికారులు ఇచ్చిన పత్రంలో–బ్రిటిష్‌ ఇండియన్‌ (బ్రిటిష్‌ భారతీయుడు) అనే కేటగిరీ మీద టిక్కు పెడతాను. అయితే, నేను పూర్తిగా బ్రిటిష్‌ వాణ్ని. ఇది నా ఇల్లు. నా దేశం. కానీ, మతం, సంస్కృతి రీత్యా నేను భారతీయుడిని. .హిందువును. నేను హిందువు అనే విషయం బాహాటంగానే చెబుతాను,’ అని 41 ఏళ్ల యువ కన్సర్వేటివ్‌ పార్టీ నాయకుడు సునక్‌ తేల్చిచెప్పారు. ఎక్కడా కులం ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడ్డారు. ఇంటర్వ్యూ చేసిన పంజాబీ హిందూ ఖత్రీ జర్నలిస్టు అంజలీ పురీ కూడా ఆయన కులం సంగతి వెల్లడించలేదు.
అమెరికాలో మాత్రం రాజకీయాల్లో మతం పాత్ర పెద్దదే!
–––––––––––––––––––––––––––––––––––
‘నేను బీప్‌ (ఆవు లేదా ఎద్దు మాంసంతో చేసిన వంటకాలు) తినను. కాని, బీఫ్‌ భుజించకపోవడం నాకు ఎప్పుడూ సమస్య కాలేదు,’ అని రిషి అన్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే, ‘అక్కడి రాజకీయ జీవితంలో మతం విస్తరించి ఉంది. అయితే. ఇక్కడ (ఇంగ్లండ్‌) అదృష్టవశాత్తూ ఆ పరిస్థితి లేదు. మతం రాజకీయాలను నడిపించదు,’ అని సునక్‌ చెప్పారు. నిజమే, ఇంగ్లండ్‌ లో క్రైస్తవుడు కాని ప్రధాని గతంలో ఒకసారి పరిపాలించారు. యూదు కుటుంబంలో పుట్టిన బెంజమిన్‌ డిజ్రేలీ ఆధునిక కన్సర్వేటివ్‌ పార్టీ నిర్మాత. 19వ శతాబ్దంలో ఆయన రెండుసార్లు (మొదటిసారి 1868లో ఫిబ్రవరి నుంచి డిసెంబర్‌ వరూ, రెండోసారి 1874–80) బ్రిటన్‌ ప్రధానిగా పనిచేశారు. బ్రిటిష్‌ వాళ్లు అంతటి విశాల హృదయం కలవారని రిషి సునక్‌ నమ్మకం. 95 శాతం శ్వేతజాతీయులు ఉన్న నియోజకవర్గం రిచ్మండ్‌ (యార్క్‌ షైర్‌) నుంచి వరుసగా బ్రిటిష్‌ పార్లమెంటుకు ఎన్నికైన డాక్టర్‌గారి, మందుల షాపు యజమాని దంపతుల (యశ్వీర్, ఉష సునక్‌) కొడుకు రిషి విశ్వాసం నిజమౌతుందనే కోరుకుందాం.
భార్య అక్షతకు సోనియాగాంధీతో చక్కటి పోలిక
–––––––––––––––––––––––––––––
రిషి భార్య అక్షతకు రిషితో 2009లో బెంగళూరులో అంటే పుష్కరకాలం కిందటే పెళ్లయింది. అయితే, భర్త బ్రిటన్‌ ఆర్థిక మంత్రి అయ్యాక కూడా ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి గారమ్మాయి బ్రిటిష్‌ పౌరసత్వం తీసుకోలేదు. ఇప్పటికీ ఆమె ఇండియన్‌ సిటిజనే (పౌరురాలు అనే మాట నాకు నచ్చదు). ఈ విషయంపై రిషి మాట్లాడుతూ, ‘నా భార్య నిర్ణయాలు, ఇష్టాలను నేను గౌరవిస్తాను. ఆమె తన భర్త ఆస్తి కాదు. ఆమె ప్రైవేట్‌ సిటిజన్, ’ అంటూ అక్షతను వెనకేసుకొచ్చాడు సునక్‌. ఆమెకు బ్రిటిష్‌ పౌరసత్వం లేదు. అందువల్ల ఆమె ఆదాయం, లాభాలపై పన్ను మినహాయంపు ఉంది. బ్రిటిష్‌ చట్టాలు కల్పించే వెసులుబాటును సుధా మూర్తిగారమ్మాయి చక్కగా వాడేసుకుంటోంది. తప్పేంలేదు కదా. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇందిరమ్మ పెద్దబ్బాయి రాజీవ్‌ తో ఇటలీ యువతి సోనియా మైనోకు 1968లో పెళ్లయింది. అయితే, తన భర్త రాజీవ్‌ 1984లో భారత ప్రధాన మంత్రి అయ్యాకే  అనవరసర విమర్శలు ఎదుర్కొనలేక ఆమె భారత పౌరసత్వం తీసుకున్నారు. రాజీవ్‌ ప్రధాని అయిన కొన్నేళ్లకు ఆమెకు భారత పౌరసత్వం అవసరమనిపించింది. ఒకవేళ ఈ నెలలో రిషి యూకే ప్రధాని అయితే గనుక ఆయన భార్య అక్షత బ్రిటిష్‌ పౌరతస్వం తీసుకునే అవసరం, అవకాశం లేదనే అనుకోవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లి, రాజ్యాంగబద్ధ రాజరికానికి పుట్టినిల్లు అయిన యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ మనల్ని ఎప్పుడో రెండొందల ఏళ్లు ఏలిన మాట నిజమే. అయితే, 9 పదులు దాటిన రాణి పాలనలోని ఈ సమైక్య రాజ్యం గొప్పదేశం. గాంధీ, నెహ్రూ తదితర బనియా–బ్రాహ్మణ నేతలకు, బీంరావ్‌ వంటి మరెందరో ఈ ఇద్దరు కన్నా గొప్పవాళ్లకు మంచి చదువుసంధ్యలు నేర్పిన గొప్ప జాతి ఇంగ్లండ్‌.