ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారి, ప్రజా ప్రతినిధులంతా ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా … తానా అంటే తందానా అనకపోతే పార్టీ ద్రోహులయితే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ… అమ్మకాలు తగ్గితే అధికారులను తిట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. అమరావతియే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత , ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తానంటే ..ప్రజా ప్రతినిధులు ప్రశ్నించవద్దా?..సీఎం చెప్పిన దాని కల్లా జీ హుజూర్ అని అనాలా?? అంటూ మండి పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులతో తిరుగుబాటు ప్రారంభం అయ్యిందని.. సీఎం నడవడిక ప్రవర్తన మార్చుకోకపోతే మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని రఘురామ హెచ్చరించారు.
సీఎం వైఖరి మార్చుకుంటే… ప్రజా ప్రతినిధులంతా మార్చుకోవాలా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్నారని ప్రజా ప్రతినిధులంతా తమ వైఖరిని మార్చుకోవాలా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులంతా ఏమైనా ఆయనకు బానిసలా? అని నిలదీశారు. మూడేళ్ల క్రితం తాను ఈ విధంగా ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు.
ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే… మా ఆత్మగౌరవాన్ని కాపాడండి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే, ప్రజాప్రతినిధుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ లను రాష్ట్ర ప్రభుత్వం మానివేస్తే మంచిదని హితువు పలికారు. ప్రజా ప్రతినిధుల ప్రైవసీని హరించడం అంత మంచిది కాదన్నారు. ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేసి ఉంటే పార్టీ అధ్యక్షుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడాలని రఘురామ పేర్కొన్నారు.