తెలంగాణలో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా కలిసిన ఈరెండు పార్టీలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటిచేయనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నికల్లో రెండు లేదా మూడు సీట్లలో ఆపార్టీ అభ్యర్థులు పోటి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేతలు ఇప్పటికే కార్యచరణను రూపొందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా అధికార బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కన్ఫర్మ్ చేశాడు. అయితే దేవరకొండ సీటు కమ్యూనిస్టులకు ఇవ్వాల్సి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ పరిస్థితి ఏంటన్న చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు కమ్యూనిస్టులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ..ఈసీటు వదులుకోవడానికి ఇష్ట పడటంలేదని.. ఆపార్టీ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఒకవేళ ఎర్రగులాబీకి సీటు ఇచ్చే పరిస్థితుల్లో .. రామవత్ అంజయ్యనాయక్ (గిరిజన ప్రజానాట్యమండలి సభ్యలు) లేదా డాక్టర్ రవినాయక్ పోటి చేసేందుకు అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికొస్తే ..కాంగ్రెస్ పార్టీ నుంచి బాలునాయక్ పోటిచేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ శిష్యుడు బిల్యానాయక్ పేరు వినిపిస్తున్న ..గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం బాలునాయక్ కి ఉండటంతో పార్టీ ఆయన అభ్యర్థిత్వతానికి మొగ్గు చూపే అవకాశముంది. ఇదే పార్టీలో కొనసాగుతున్న కిషన్ నాయక్ ,జగన్ లాల్ , రవినాయక్ ,రమేష్ నాయక్ సైతం టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ నుంచి కేతావత్ లాలు నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.ఇతని భార్య గ్రామ సర్పంచ్ గా కొనసాగుతున్నారు. అంతేకాక రాష్ట్ర గిరిజన మోర్చా నాయకుడిగా కొనసాగుతుండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. కల్యాణ్ నాయక్ , నీలా రవినాయక్ సైతం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు.