National:
దేశ రాజకీయాల్లో 2029 లోక్సభ ఎన్నికలపై అప్పుడే ఆసక్తి మొదలైంది.ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. కేంద్రంలో మరోసారి NDA కూటమిదే అధికారం అంటూ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.సర్వే ప్రకారం NDAకు 326 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే గత జనవరి సర్వేతో పోలిస్తే NDA బలంలో తగ్గుదల కనిపించింది. అప్పట్లో 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 326కు పడిపోయింది.
మరోవైపు ప్రధాన పార్టీ బీజేపీకి కూడా సీట్లు తగ్గుతాయని సర్వే చెబుతోంది. గత సర్వేలో 287 సీట్లు వస్తాయని అంచనా ఉండగా.. ఇప్పుడు 261 సీట్లకు పరిమితం అవుతుందని పేర్కొంది.అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 240 సీట్లతో పోలిస్తే.. ఈ అంచనా మాత్రం మెరుగైనదే.
ఇక కాంగ్రెస్కు మాత్రం ఈ సర్వే భారీ ఊరటనిచ్చింది.
ప్రస్తుతం ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు 106 సీట్లు వస్తాయని అంచనా. గత జనవరి సర్వేలో కాంగ్రెస్కు కేవలం 80 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఏకంగా 26 సీట్లు పెరిగాయి.మొత్తంగా INDIA కూటమికి 185 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. గత జనవరి అంచనా 182 సీట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.ఓట్ల శాతం విషయానికి వస్తే.. NDAకు 45.1 శాతం, INDIA కూటమికి 39.1 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
ఈ సర్వే కోసం జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మంది నుంచి ప్రత్యక్షంగా అభిప్రాయాలను సేకరించినట్లు వెల్లడైంది. అదనంగా గత ఆరు నెలల్లో నిర్వహించిన 91,795 ట్రాకింగ్ ఇంటర్వ్యూలను కూడా విశ్లేషణలో ఉపయోగించారు.
అంటే..
NDAకు మెజారిటీకి సరిపడా సీట్లు వస్తాయని అంచనా ఉన్నా.. గతంతో పోలిస్తే బీజేపీ, NDA బలంలో కొంత తగ్గుదల కనిపిస్తోంది.అదే సమయంలో కాంగ్రెస్ బలం పెరగడం ప్రతిపక్షానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.
అయితే ఇది కేవలం ప్రస్తుతం ఉన్న ప్రజాభిప్రాయంపై ఆధారపడిన సర్వే అంచనా మాత్రమే. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. అప్పటికి రాజకీయ సమీకరణాలు, పొత్తులు, రాష్ట్రాల వారీ పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది.మరి 2029లోనూ NDAదే హవానా?
లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం గట్టి పోటీ ఇస్తుందా?
ప్రస్తుతం వెలువడిన ఈ సర్వే మాత్రం NDAకే మరోసారి ఆధిక్యాన్ని కట్టబెట్టింది!


