అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం..

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్‌ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.

రజనీకి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ఆయనకు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు.