తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసిద్ధి చెందిన రాజబాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన గత రాత్రి మృతి చెందారు. 64 సంవత్సరాల రాజబాబు 62 సినిమాల్లో నటించి మంచి పేరు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసరావుపేట. చిన్నటప్పటి నుంచే నటనపై మక్కువ పెంచుకున్న ఆయన దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1995లో ఊరికి మొనగాడు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన సింధూరం, సముద్రం, మురారి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, భరత్ అనే నేను వంటి విభిన్న చిత్రాల్లో నటించి అందరి మెప్పూ పొందారు. గోదావరి జిల్లా యాసలో ఆయన చెప్పే మాటలు తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.
రాజబాబు సినిమాల్లోనే కాక వసంత కోకిల, అభిషేకం, రాథా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి.ల.సౌ. స్రవంతి వంటి సీరియళ్లలోనూ ప్రేక్షకుల్ని అలరించారు రాజబాబు. 2005లో అమ్మ సీరియల్‌లో ఆయన నటనకు నంది అవార్డు దక్కింది.
……………………………