భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు.. అప్రమత్తమైన కేంద్రం!

భారత్ లో మరో మహామ్మారి మంకీపాక్స్ కలకలం రేపుతోంది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కేరళలో మంకీపాక్స్‌ సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈనేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నిపుణులతో కూడిన బృందాన్ని ఆరాష్ట్రానికి పంపింది.

ఇక మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి వీణాజార్జ్ ANI తో మాట్లాడారు. అతను ఈనెల 12న తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్నాడని.. ఆందోళన చెందడానికి ఏమీ లేదన్నారు. అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అతని నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని.. ఇప్పటీకే అతని తల్లిదండ్రులు, ఆటోడ్రైవర్ తో పాటు విమానంలోని 11 మంది తోటి ప్రయాణికులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.

మంకీపాక్స్ కలకలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. యూరప్, అమెరికాలోని కేసులపై ఆందోళన చెందుతూ.. కేంద్రం మేలో ఐసోలేషన్, కాంటాక్ట్-ట్రేసింగ్ గురించి మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.