చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బౌలర్ల కోసం ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్లు వేలంలో పోటీ పడడం విశేషంగా చెప్పవచ్చు.
ఐపీఎల్లో మోరిస్ సరికొత్త రికార్డు..
దక్షిణాఫ్రికా పేస్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మోరిస్ రికార్డు నమోదు చేశాడు. అతని కనీస ధర 75 లక్షలు కాగా, 16.25 కోట్లకు వేలంలో అమ్ముడుపోయాడు. అతని కోసం పలు ఫ్రాంచేజిలు పోటీపడగా , రాజస్థాన్ రాయల్స్ అతని దక్కించుకుంది. అత్యధిక ధర ఆటగాడిగా భారత ఆటగాడు యువరాజ్ సింగ్ (16 కోట్లు)పేరు మీద ఉన్న రికార్డును మోరిస్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో 70 మ్యాచ్లు ఆడిన అతను 80 వికెట్లతో పాటు 551 పరుగులు చేశాడు.
ఇక న్యూజిలాండ్ యువ బౌలర్ జేమిసన్ ఐపీఎల్లో జాక్ పాట్ కొట్టాడు. అతని కనీస ధరను మించి ఆర్సిబి 15 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన అతను బోలింగ్ తోపాటు బ్యాటింగ్లోలోను రాణించగలడు. ఆస్ట్రేలియాకు చెందిన మరో యువ పేసర్ జే రిచర్డ్సన్ ను 14 కోట్లకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఇదే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడని, ఆస్ట్రేలియాకు చెందిన యువ పేసర్ మెరిడిత్ ను వేలంలో 8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా చెప్పవచ్చు.
మ్యాక్స్వెల్ కోసం పోటీ..!
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. చివరకి అతనిని 14.25 కోట్లకు ఆర్ సి బి దక్కించుకుంది. గతేడాది ఐపీఎల్లో దారుణంగా విఫలమైన మ్యాక్స్వెల్ కోసం ఫ్రాంచేజీలు పోటిపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లాండ్కు చెందిన మరో ఆల్ రౌండర్ మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ 7 కోట్లకు దక్కించుకోవడం విశేషం. ఇదే జట్టు టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాను అతని కనీస ధర 50 లక్షలకు తీసుకుంది. భారత్ స్టార్ ఆటగాళ్ళు కేదార్ జాదవ్ హర్భజన్ సింగ్ లను, కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ చెరో రెండు కోట్లకు తీసుకున్నాయి.