ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగరేస్తామని ఆయన అన్నారు. శివాజీ విగ్రహాన్ని తొలంగించిన చోటే ఆయన నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పి శివాజీ చౌక్ గా నామకరణం చేస్తామని సంజయ్ స్పష్టం చేశారు. అనంతరం భాజపా, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలతో కలిసి ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు. ఇటీవలే భాజపా శ్రేణులు బోరాబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయబోగా బల్దియా యంత్రాంగం అడ్డుకున్న నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.