ఐపీఎల్ 20 21 సెకండ్ షెడ్యూల్ కి అంతా సిద్ధం!!

కరోనా మహమ్మారి కారణంగా అర్దాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ 2021 మిగతా మ్యాచ్ల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ సహా ఇతర అధికారులు ఇప్పటికే కీలక చర్చలు జరిపారు. బీసీసీఐ అడిగిన ప్రతీ అంశానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. 25 రోజుల్లోనే 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐపీఎల్ సీజన్ 2021 సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 17న ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న ఫైనల్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మ్యాచ్లను.. 25 రోజుల్లో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు లెక్కన నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
T20 world cup ఎక్కడ..
టీ20 వరల్డ్ కప్ నిర్వహణ ఇండియాలో సాధ్యం కాకపోతే .. ఆ టోర్నీని కూడా యూఏఈకి మార్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అక్టోబర్ 1 నాటికి యూఏఈలోని అంతర్జాతీయ స్టేడియంలు అన్నీ ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. కనుక ఒక వారం ముందుగానే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ అన్నీ ఒకే వేదికగా నిర్వహించనున్నారు.
మరోవైపు జూన్ 28 తర్వాత ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై జూన్ 28న ఐసీసీకి బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. తద్వారా జూన్ చివరి వారంలో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.