అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారతీయులకే అధిక ప్రయోజనం చేకూరనుంది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈఏజీఎల్ఈ) చట్టం–2021’ను సభలో ప్రవేశట్టగా.. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది.. వ్యతిరేకంగా 65 మంది ఓటేశారు. ఇక సెనెట్ ఆమోదం కూడా పొందితే ఈ ప్రతిపాదన చట్ట రూపం దాల్చనుంది.
ప్రస్తుత వలస విధానంలో భారత్‌కు కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్ 1బీ వర్కింగ్ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు గ్రీన్‌కార్డు పొందడంలో అడ్డంకిగా మారింది. అందువల్ల, తాజా బిల్లుకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం ఉన్న 7 శాతం ఉన్న కోటా 15 శాతానికి పెరగనుంది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ఇతర దేశాల కన్నా భారతీయులకే ఎక్కువ లబ్ధి చేకూరనుంది.
ఈ కోటాను 15 శాతానికి పెంచితే ఎక్కువ మందికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్‌పై.. కాంగ్రెస్ చైర్మన్ లోఫ్గ్రెన్ మాట్లాడుతూ.. ‘వలసదారులకు వీసాలను కేటాయించే ప్రాథమిక చట్టం 20 వ శతాబ్దం మధ్యకాలం నాటిది. ఈ చట్టంలో చివరిగా 1990లో మార్పులు చేశారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీలో మార్పులు చేయాల్నిన అవసరం ఉంది. తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్‌కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.
కాగా, ఈ బిల్లు గట్టెక్కితే హెచ్1బి వీసాపై అమెరికాలో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరిగే అవకాశం ఉంది.