Nancharaiah merugumala :(political analyst)
తెలంగాణ బీఆరెస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాలు మొదలెట్టిన ఈ ముగ్గురు దక్షిణాది ప్రాంతీయ నాయకులు లేకుండా ఇం.డి.యా ముందుకు పోవడం అంత తేలిక కాదు మరి. భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) నాయకత్వంలోని కొత్త రాజకీయ కూటమి ఇంగ్లిష్ పేరును కాంగ్రెస్ పార్టీ పేరులోని మొదటి రెండు పదాలు–ఇండియన్ నేషనల్- తో ప్రారంభించడం దేన్ని సూచిస్తున్నట్టు అనుకోవాలి? 2014 ఎన్నికల్లో 44, 2019 ఎన్నికల్లో 52 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇం.డి.యాలోని మిగిలిన 25 మిత్రపక్షాల సాయంతో తన బలాన్ని 2024 ఎన్నికల్లో కనీసం 104 సీట్లకు పెంచుకోగలిగితే గొప్ప విజయం సాధించినట్టే.