Nancharaiah merugumala senior journalist:
తెలుగుకు ‘ప్రాచీన’ హోదా తేలిగ్గా తెచ్చేశారు, ఆధునిక భాషగా చేయడమే కష్టమైన పనా?
దక్షిణాది భాష తమిళానికి 2004 అక్టోబర్ 12న భారత ప్రభుత్వం క్లాసికల్ లాంగ్వేజ్ (హిందీలో ‘శాస్త్రీయ భాష, తెలుగులో ప్రాచీన భాష) హోదా ఇచ్చింది. ఏడాది తర్వాత సంస్కృతానికి 2005 నవంబర్ 25న ప్రాచీన భాష హోదా కల్పించింది. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు, అన్నే భవానీ కోటేశ్వరప్రసాద్ గారు వంటి తెలుగు కవులు, పాత్రికేయుల ద్విగుణీకృత ఆందోళనతో మూడేళ్ల తర్వాత తెలుగుకు, దానికి తోడుగా లిపిలో పోలికలున్న కన్నడానికి ప్రాచీన భాష హోదాను 2008 అక్టోబర్ 31న నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలకు 2013 మే 23న మలయాళానికి ప్రాచీన భాష హోదా ఇచ్చింది అదే యూపీఏ సారథ్యంలోని కేంద్రం. ఏడాది తిరగకుండానే 2014 ఫిబ్రవరిలో ఒడియాకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్.. అదే.. శాస్త్రీయ భాషగా గుర్తింపు ఇచ్చింది కేంద్ర సర్కారు. కాంగ్రెస్ నాయకత్వంలో, డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని, సోనియాగాంధీ మార్గదర్శకత్వంలోని యూపీఏ సర్కారు తన పది సంవత్సరాల పాలనాకాలంలో ఇలా తమిళంతో మొదలెట్టి ఒడియా వరకూ…అంటే ఆరు భారతీయ భాషలను ప్రాచీనభాషలుగా ప్రకటించింది.
తమిళంతో ఆరంభించి తెలుగు, కన్నడ భాషల మీదుగా ఒడిశా తీరం చేరుకుని యూపీఏ ప్రభుత్వం 2014 వేసవిలో బాంగ్లా తుఫాను దెబ్బకు కొట్టుకుపోయింది. తెలుగుకు ప్రాచీన హోదా కల్పిస్తే…కొంపలు మునుగుతాయని కొందరు జ్యోతిష్యులు చెప్పినా సోనియాగాంధీ వినలేదు. ఇప్పుడేమో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ సొంత మెజారిటీ లేకుండా పోయేసరికి మన్మోహన్‌సింగ్ బాటన నడుస్తూ 2024 అక్టోబర్ 3న ఒకేసారి ఐదు భాషలకు (అసామీ, బాంగ్లా, మరాఠీ, పాలీ, ప్రాకృతం) క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. సంస్కృతం కన్నా తమిళానికి ముందు ఈ ‘శాస్త్రీయ’ భాష స్టేటస్ దక్కడం, పాలీ, ప్రాకృతాల కన్నా ముందు తెలుగు, కన్నడాలకు ప్రాచీన భాషలుగా గుర్తింపు పొందడం దక్షిణాది జనం గర్వపడాల్సిన విషయమేనంటారా? ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే ఇంగ్లిష్, హిందీలు ఎన్నటికీ ఈ దిక్కుమాలిన ప్రాచీన భాష హోదా పొందే ముప్పు లేకుండా… రోజురోజుకు ఎదిగిపోతుండడం చూడడానికి, వినడానికి చాలా బాగుందని అనేక మంది భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించడం వల్ల మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి అసలు ప్రయోజనం ఉండదనే అనుకోవచ్చు. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు తీసుకురావడానికి తెలుగు బుద్ధిజీవులు దాదాపు 16 ఏళ్ల క్రితం ప్రదర్శించిన ఆత్రం, చేసిన పైరవీలు తెలుగునాడు ఐక్యత కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించకుండా నివారించడానికి చేసి ఉంటే చాలా బావుండేది. తెలుగును ఆధునిక భాషగా ‘అభివృద్ధి చేయడానికి’ ఇకనైనా ప్రయత్నిస్తే మంచిది. ఎంతకాదన్నా తెలుగు పత్రికల్లో ‘నాణ్యమైన కంటెంట్ ‘, ‘క్రియేటివిటీ’ ఉంటాయని అత్యధిక తెలుగు జనం అంగీకరించే తెలుగు దినపత్రిక ‘ఈనాడు’ తన ఎడిట్ పేజీలో ఇటీవల ఒక వ్యక్తి సంక్షిప్త అభిప్రాయాన్ని పేరుతో ఇచ్చిన తర్వాత– కంటెంట్ క్రియేటర్.. అని రాయడం కోట్లాది మంది తెలుగోళ్ల కళ్లలో నీళ్లు తిరిగేలా చేసింది.
అసలు ఈనాడు సైతం కంటెంట్ క్రియేటర్ అనే ఆంగ్ల పదానికి తెలుగు మాట ‘సృష్టించలేక’ చతికలపడిందంటే ఎనుముల రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగర శివారుగా వర్ణించే తెల్లాపూర్ వ్యవసాయక్షేత్రంలో కూర్చుని నెలలు నెలలు చర్చలు జరిపినా ఫలితం ఉండదు. ముఖ్యమంత్రులు ఎందరు వచ్చినా తెలుగును ఆధునిక భాషగా మార్చడానికి ఏమి చేయలేకపోతున్నారు. ఒక భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును పైరవీలు, లాబీయింగ్ ద్వారా తీసుకురావడం తేలికేగాని, ఆధునిక భాషగా తీర్చిదిద్దే ప్రక్రియ పకడ్బందీగా మొదలెట్టడం కష్టమైన పనే. ఎవరో అన్నట్టు ‘అగ్రికల్చరే తప్ప కల్చర్ లేని’ తెలుగునాట తెలుగు భాష ఎలా ఆధునిక భాషగా అవతరిస్తుంది?