Haryana: హర్యానా బరిలో కాంగ్రెస్ జోరును.. బీజేపీ ఆపేనా..?

Haryanaelections2024:

హర్యానా చిత్రం స్పష్టమౌతోంది. ఒకే విడతలో ఈ శనివారం పోలింగ్ జరుగనున్న అసెంబ్లీ ఎన్నిక, అధికార బీజేపీ- విపక్ష కాంగ్రెస్ మధ్య దాదాపు ముఖాముఖి పోటీగానే తయారయింది. చిన్న పార్టీలకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బే తగులనుంది. గత మే నెల్లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికే స్వల్ప ఆధిక్యత సాధించిన కాంగ్రెస్… ఆ పట్టు సడలనీకుండా పురోగమిస్తోంది. ఆధిక్యతా స్పష్టమౌతోంది. పదేళ్ల వరుస పాలన వల్ల ఎదురవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పలు అంశాలు బీజేపీకి ప్రతికూలంగా పనిచేస్తుంటే, కాంగ్రెస్కు ఆయా అంశాలే కలిసివస్తున్నాయి. అయినా… జాటేతరులు, ముఖ్యంగా ఓబీసీలే తమను గట్టెక్కిస్తారని బీజేపీ ఇంకా ఆశావహంగానే ఉంది. పెద్దగా స్థానాలు గెలిచే సంకేతాలేం లేకున్నా… తిరుగుబాటు అభ్యర్థులు, చిన్న పార్టీలవారు, స్వతంత్రులు అక్కడక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ఆస్కారముంది. ఓ అరడజన్.. ప్రాంతాలు, సామాజికవర్గాలు, విభిన్న సమూహాల మొగ్గు సరళి చూసినపుడు కాంగ్రెస్ గెలుపు అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.

హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఏ విధంగా చూసినా… కీలకమై కూర్చుంది. జాతీయ స్రవంతి ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్ లకే కాకుండా ఆయా పార్టీలు నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములకు కూడా ఈ ఎన్నిక ముఖ్యమైందే! వరుసగా రెండు పర్యాయాలు గెలిచి, గడచిన పదేళ్లుగా హర్యానాను పాలించిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఎదురీదుతోంది. కేంద్రంలో, హర్యానాలో అధికారం కోల్పోయి పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి పుంజుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక సంకేతలు 2024 లోక్సభ ఎన్నికల్లోనే వెలువడ్డాయి. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ హర్యానాలోని మొత్తం 10 లోక్సభ స్థానాలు గెలిచి ‘క్లీన్ స్వీప్’ చేసిన బీజేపీని నిన్నటి (2024) ఎన్నికల్లో 5 స్థానాలకు పరిమితం చేసింది కాంగ్రెస్. అనూహ్యంగా మిగతా 5 స్థానాల్లో తానే గెలిచింది. నిన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న, దేశంలోనే మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయిన జమ్మూ-కశ్మీర్తో పాటు హర్యానా ఎన్నికల్ని కలిపి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఈనెల 8న జరుగనుంది. ఈ క్రమంలోనే తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
జాతీయ పరిణామాల కన్నా స్థానికాంశాలు, పార్టీల రాజకీయ పరిస్థితులే హర్యానా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.

ఇటీవల ఒక టీవీ చర్చ సందర్బంగా, ఓ సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్య… ‘కిసాన్, పహిల్వాన్, నవజవాన్ లు హర్యానాలో బీజేపీకి తమ దెబ్బ చూపించే పనిలో నిమగ్నమై ఉన్నార’న్నది సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా జనాల్లోకి వెళ్లింది.

దేశంలోనే క్రీడలకు సాధారణంగా, కుస్తీ పోటీలకు ప్రత్యేకంగా పేరుబడ్డ ‘దంగల్’ (కుస్తీ పోటీల బరి) హర్యానా! ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం కన్నా ముందు నుంచే ‘పీపుల్స్ పల్స్’ సర్వే సంస్థ రాష్ట్రంలో విడతలుగా ట్రాకర్ పోల్ నిర్వహిస్తోంది. 90 స్థానాలున్న హర్యానాలో మ్యాజిక్ నంబర్ 46 సాధించడానికి రెండు ప్రధాన పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ కుస్తీ పడుతున్నాయి. పోలింగ్ నాటికి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతలోకి దూసుకువచ్చింది.

ఆ ఆరంశాలు చెప్పేదేమంటే….!

దేశ రాజధాని ఢిల్లీని అత్యధిక సరిహద్దుతో ఆవరించి ఉన్న రాష్ట్రం హర్యానా కావడంతో సహజంగానే ఈ ఎన్నిక దేశ ప్రజల దృష్టిని ఆకర్శిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది దిక్సూచి అవుతుందనీ భావిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించిన ఈ ఎన్నికల్లో ఓ అరడజన్ అంశాలు పార్టీల గెలుపు అవకాశాల హెచ్చుతగ్గులను సూచిస్తున్నాయి. 1) బీజేపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత బలంగా ఉంది. నిరుద్యోగిత, రైతాంగ సమస్యలు, పెరిగే ద్రవ్యోల్భణం వల్ల నియంత్రణలోకి రాని నిత్యావసరాల ధరలు… వంటి కారణాలతో ఇది మొన్నటి లోక్సభ ఎన్నికల నాటికన్నా బలంగా, ‘పరివర్తన్’ పేరిట ప్రచారమవుతోంది. 2) రైతులు, యువత, మధ్యతరగతి వర్గాల్లో బీజేపీని ఓడించాలని పెరుగుతున్న పట్టుదల సహజంగానే కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరమౌతోంది. అందువల్లేనేమో, వారి సానుకూలత క్రమంగా పెరుగుతోంది. 3) ఈ సారి చిన్న పార్టీలు…. భారత జాతీయ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతాపార్టీ (జేజేపీ), ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లతో సహా ఏవీ పెద్దగా ప్రభావం చూపేలా లేవు. వాటికీసారి పెద్ద దెబ్బే పడనుంది. 4) బీజేపీ మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ అంటే ప్రజాక్షేత్రంలో బలమైన వ్యతిరేకత ఉండగా, కాంగ్రెస్ పార్టీ రథసారథి భూపేందర్సింగ్ హుడాకు ఇదివరకెప్పుడూ లేనంత ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. 5) కులాలు కీలక పాత్ర పోషించే హర్యానా బరిలో, బలమైన జాట్లు ఈ సారి కాంగ్రెస్కు సంపూర్ణంగా మద్దతిస్తున్నారు. బీజేపీ ఓబీసీ ల పైన పెద్దగా ఆశలు పెట్టుకుంది. మరో ముఖ్య సామాజికవర్గమైన దళితుల్లో అత్యధికులు ఈ సారి కాంగ్రెస్ వైపు మారుతున్న సంకేతాలున్నాయి. 6) కనీస మద్దతు కోసం ఉద్యమించిన రైతాంగం (కిసాన్), రక్షణ ఉద్యోగాల కోసం నిరీక్షించి, అగ్నిపథ్ను తీవ్రంగా నిరసిస్తున్న యువత (నవ జవాన్), కేంద్ర`రాష్ట్ర సర్కార్ల నిర్వాకాల వల్ల మహిళా రెజ్లర్ల పట్ల అవమానాలు జరిగాయని ఉద్యమించిన కుస్తీయోధులు (పహెల్వాన్) బీజేపీ ఓటమి కోసం పనిచేస్తున్న దాఖలాలున్నాయి.

ఆరు జనసమూహాల చూపు ఎటో?

కులాల పరంగానే కాక…. మహిళలు, యువత, ప్రభుత్వోద్యోగులు, వర్తకులు తదితర జనసమూహాల స్పందన ఎలా ఉంటుంది? అన్నది కూడా ఈసారి ముఖ్యమే!

1) మహిళలు: పశ్చిమ బెంగాల్లో లాగా మహిళలది హర్యానాలో నిర్దిష్ట ఓటు బ్యాంకు కాదు. ప్రధానంగా కులం, గ్రామం, కుటుంబం వంటి అంశాలను బట్టి ఆయా మహిళల ఓటు నిర్ణయం ఉంటుంది. అయినప్పటికీ, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగిత, ప్రభుత్వ వ్యతిరేకత, మహిళా రెజ్లర్ల నిరసనోద్యమాలు వంటి అంశాల కారణంగా ఈసారి మెజారిటీ మహిళలకు కాంగ్రెస్ వైపు మొగ్గే సూచనలున్నాయి.

2) యువత : నిరుద్యోగ సమస్య విషయంలో యువతరం బహిరంగంగానే సర్కారుపై చేస్తున్న విమర్శల్నిబట్టి అత్యధికులు విపక్ష కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశాలున్నాయి.

3) రైతులు : అత్యధికులు కులాల వారిగా ఇరుపక్షాల మధ్య చీలి ఉన్నారు. జాట్, సిక్కు, చమర్, ముస్లిం, ఇతర కొన్ని వెనుకబడిన వర్గాల రైతు కుటుంబాలు కాంగ్రెస్కు మద్దతిచ్చే ఆస్కారముంది. అదే సమయంలో సైనీ, రోర్, యాదవ, కశ్యప్ రైతాంగవర్గాలు బీజేపీ కి అనుకూలంగా నిలవొచ్చు.

4) సేవా-అసంఘటిత రంగాలు : సేవారంగ ఉద్యోగులకు సంబంధించి నగర`పట్టణ ప్రాంతాల్లో మొగ్గు బీజేపీ వైపుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇరువైపులా చీలి ఉన్నారు. ఇక అసంఘటిత రంగ కార్మికుల్లో నగర`పట్టణ, గ్రామీణ ప్రాంతాలని తేడా లేకుండా మెజారిటీ కాంగ్రెస్కు సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమౌతోంది.

5) వర్తకులు: వాణిజ్యవర్గాలు – మెజారిటీ బీజేపీతో ఉన్నారు. కానీ, అభివృద్ది లేమి, ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థుల ఎంపిక టిక్కెట్లలో గందరగోళం వంటి కారణాల రీత్యా ఆ మద్దతు కొంత తగ్గుతున్నట్టు కనిపిస్తోంది.

6) ప్రభుత్వ ఉద్యోగులు : ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఇదివరకటి ముఖ్యమంత్రి కట్టర్ కారణంగా తాము జీతభత్యాలు, ఇతర ఆర్థికాంశాల్లో నష్టపోయామనే వారి భావన ఇందుకు కారణం కావచ్చు.

ప్రాంతాలవారీ చిత్రమూ స్పష్టమే!

హర్యానాను భౌగోళికంగా ఆరు ప్రాంతాలుగా విభజిస్తారు. రెండు ప్రాంతాల్లో బీజేపీ కి, మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఆధిక్యత కనిపిస్తుండగా ఒక ప్రాంతంలో మాత్రం ఆధిక్యత నీకా-నాకా అన్నట్టుంది.

1) హిసార్ – హిసార్తో పాటు సిర్సా, ఫతేబాద్, జింద్ జిల్లాలు ఇందులో ఉన్నాయి. ఇది రాజస్తాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతం. దళితులది పెద్ద సంఖ్యే, కానీ, జాట్, సిక్కులు ఎక్కువ ప్రభావితం చేస్తారు. జేజేపీ, ఐఎన్ఎల్డీ లకు బాగా పట్టుంది. కానీ, ఈసారి బలహీనంగా కనిపిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఓట్లు అందరికీ పడ్డాయి. జాట్లు, సిక్కులు, దళితులు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గడం సమీకరణాల్నే మారుస్తోంది. బీజేపీతో అంటకాగుతున్నట్టు అభయ్ చౌతాలా ఒకరకం ఇబ్బంది ఎదుర్కొంటే, మాజీ ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయలేని పరిస్థితి. మొత్తమ్మీద పరిస్థితి కాంగ్రెస్కు అనుకూలం,

2) ఫరీదాబాద్: ఫరీదాబాద్తో పాటు నూప్ా, పల్వల్ జిల్లాలు ఇందులోకి వస్తాయి. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్తో సరిహద్దులున్న ఈ ప్రాంతం ప్రధానంగా పారిశ్రామిక మండలం. ముస్లింలు, దళితులు, గుజ్జర్ల ప్రాబల్యం ఎక్కువ. కొన్ని సీట్లలో బ్రాహ్మణులు, జాట్స్, బనియలు, పంజాబీలు కూడా ప్రభావం చూపగలరు. ఫరిదాబాద్లో తిరుగుబాట్ల తలనొప్పి తప్ప మూడు జిల్లాల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.

3) రోతక్ : రోతక్, సోనిపత్, భివానీ, జజ్జర్, చర్కీదాద్రి జిల్లాలు ఇందులోకొస్తాయి. దేశవాళీ (జాట్) బెల్ట్గా పిలిచే ఈ ప్రాంతంలో సోనిపత్ మాత్రం జీటీ రోడ్డు పరిధిలోకొస్తుంది. జాట్లు కాకుండా బ్రాహ్మణులు, దళితులు, బీసీలు ప్రధాన సామాజికవర్గాలు. రోతక్ కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా స్వస్థలం కావడంతో ఆయన, తనయుడు దీపెందర్ హుడాల ప్రాబల్యం ఈ ప్రాంతంలో ఎక్కువ. సోనిపత్, భీవాని మిశ్రమ ఫలితాలు రావొచ్చు తప్ప మొత్తమ్మీద ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆధిపత్యం సుస్పష్టం.

4) అంబాలా: అంబాలాతో పాటు యమునానగర్, కురుక్షేత్ర, పంచకుల జిల్లాలు ఇందులోకొస్తాయి. ప్రధానంగా జీటీ రోడ్డు పరిధి. చాలా ఓబీసీ వర్గాలున్న ఈ ప్రాంతంలో సామాజిక సమీకరణాలు మిశ్రమం. ముఖ్యమంత్రి నయాబ్సింగ్ సైనీ ప్రాంతమిది. ఇది బీజేపీ ఆధిపత్య ప్రాంతమే అయినా… ఈ సారి వారికి తిరుగుబాట్ల బెడద ఎక్కువున్న ప్రాంతాల్లో ఇదొకటి. 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ స్థానాలు కొంచెం తగ్గి, కాంగ్రెస్ స్థానాలు పెరిగే అవకాశముంది.

5) కర్నల్ : కర్నల్, కైతల్, పానిపట్ జిల్లాలు ఇందులోకొస్తాయి. బలమైన, నమ్మకమైన ఓబీసీల మద్దతుతో బీజేపీ కి పట్టున్న ప్రాంతం. ఈసారి కూడా సానుకూల ఫలితాలకు ఆస్కారముంది. కాంగ్రెస్కున్న తిరుగుబాట్ల బెడద బీజేపీకి కలిసిరావచ్చు.

6) గుర్గ్రామ్ : గుర్గ్రామ్తో పాటు రెవారీ, మహేంద్రఘర్ జిల్లాల్లోకొస్తాయి. బీజేపీకి కంచుకోట. గుర్గ్రామ్ ఆటో, ఐటీ, రియల్ఎస్టేట్ తదితర పారిశ్రామిక ప్రాంతం కాగా మిగతా గ్రామీణం. అహిర్వాల్స్, యాదవ ఓటు శాతం ఎక్కువ.

ఇద్దరి గురి హర్యానా బరి, మారిన పరిస్థితుల్లో…. గెలుపెవరిదో మరి!

===============

dilip reddy

-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
డైరెక్ట‌ర్‌, ‘పీపుల్స్ పల్స్’ రిసర్చ్ సంస్థ.