లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.* చాలా కాలం తర్వాత ఉద్యోగ ప్రకటన రావడంతో లక్షలాది మంది యువతీ,యువకులు ఉద్యోగాలు సాధించాలని ఇంటి దగ్గరి నుంచి పట్టణాల బాటపట్టారు. ఉద్యోగాలు సాధించాలనే ఆశయంతో ప్రిపేర్ అయ్యారు. చిన్నపాటి ఉద్యోగాలు కాదని ఆఫీసర్ కేడర్ లో కనబడాలని లీవ్ పెట్టి చదివేవారు అనేకం. నెల వస్తే EMI, రెంట్ ఇలా ఎన్నో సమస్యలు వాళ్లకు అయినా పరీక్షలు రాసి ఉద్యోగకలకు చేరువయ్యారు. కానీ, ఆశలు అడియాశలయ్యాయి. ఊహించని ఘటనతో కలలు కల్లలయ్యాయి.
_ఇకపై టీఎస్పీఎస్సీ మీద నమ్మకం ఉంటుందా?
ఉద్యోగాల కోసం 10 లక్షలకు పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఎంతో ఆశతో చదువుకుంటున్నారు. ఈ సమయంలో పేపర్ లీక్ కావడంతో అందరిలో మానసిక ఆందోళన మొదలయ్యింది. ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయిలో మానసిక కుంగుబాటు మొదలయ్యింది. త్వరలో ఎక్కువ ఉద్యోగాల భర్తీ టీఎస్పీఎస్సీ నుంచే జరగనుంది. ఈనేపథ్యంలో అభ్యర్థుల్లో నమ్మకం పూర్తిగా సడలిపోయిందనే చెప్పుకోవచ్చు. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం పరిశీలిస్తుంటే ఇదంతా చాలా కాలంగా కొనసాగుతున్న తతంగం అని చిన్ని పిల్లాడిని అడిగినా తెలిసిపోయేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అభ్యర్థులకు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. జరగబోయే ఎన్నిలక మీద నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. లేదంటే నిరుద్యోగులు నిరాశలో కూరుకుపోయే పరిస్థితి తలెత్తుతుంది.
లక్షలాది మంది భవిష్యత్ మీద చిల్లర రాజకీయాలా?
ఇలాంటి పరిస్థితుల్లో పాలక పక్షం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అభ్యర్థులు కుంగిపోకుండా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ, దురదృష్టవశాత్తు ఈ వ్యవహారం అంతా రాజకీయ రంగు పులుముకుంటోంది. బీఆర్ఎస్ పై బీజేపీ, బీజేపీపై బీఆర్ఎస్, ఈ రెండింటిపై కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. లీకేజీకి బాధ్యుతుల మీరంటే మీరంటూ బురదజల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు.
_మంత్రి కేటీఆర్ మతిలేని మాటలు
తాజాగా ఈ విషయంలోకి మంత్రి కేటీఆర్ ఎంటర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ రాజ్యంగ బద్ద సంస్థ. దానిలో జరిగిన పొరపాట్లకు ప్రభుత్వాన్ని, మంత్రిగా తనను టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టారు. టీఎస్పీఎస్ రాజ్యాంగబద్ద సంస్థ అని తెలియని మూర్ఖుడు బండి సంజయ్ అంటూ వికారమైన మాటలు మాట్లాడారు. అటు బీజేపీ నేతలు కూడా ఆయనకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అదే సీబీఐ, ఈడీలను మోడీ సంస్థలని ఎందుకు అంటున్నావ్ కేటీఆర్ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగ బద్ద సంస్థ అయితే, అవికూడా రాజ్యాంగ బద్దసంస్థలే కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి బాగా నేర్చుకుంది. మంచి జరిగితే తమ ఖాతాలోకి వేసుకోవడం, తప్పు జరిగితే కొంత మంది మీదకు నెట్టే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఈ వ్యవహారం కేటీఆర్ కు సంబంధం లేకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చినట్లు? అనేది అందరినీ వేధించే ప్రశ్న.
కేటీఆర్ కు సూటిగా నాలుగు ప్రశ్నలు!
• పేపర్ లీకేజీ తో నాకేం సంబంధం అని అడుగుతున్న మీరు ఏం సంబంధం ఉందని ప్రెస్ మీట్ పెట్టారు?
• అసలు మీ శాఖ ఏంటి? టీఎస్పీఎస్సీ ఏ శాఖకు సంబంధించింది?
• టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని చెప్పిన మీరు, ఆ శాఖకు సంబంధం లేని మీరు, ఫీజులు కట్టొద్దు అదే ఫీజు తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మీరు ఎలా చెప్తారు?
• సిట్ దర్యాప్తులో ఉండగానే కేవలం ఇద్దరే చేశారని మీరు ఎలా కంక్లూషన్ ఇస్తారు?
వీటికి సమాధానం చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. కేటీఆర్ అత్యుత్సాహం మీద నిప్పులు చెరుగుతున్నారు. వేలాది రూపాయలు పెట్టి కోచింగ్ లు తీసుకోవడం, రూములు అద్దెకు తీసుకోవడం, టైమ్ కు అన్నం తినకుండా కోచింగ్ కు పోవడం, నగరంలో పెట్టే ఐదు రూపాయల భోజనాలను తింటూ, ఆరోగ్యాలు పాడవుతున్నా లెక్కచేయకుండా సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ లక్షలాది మంది నిరుద్యోగులు చదువుతున్నారు. అప్పులు చేసి రూ. లక్షలు ఖర్చుపెట్టి అనేక కష్టాలను అనుభవిస్తూ తక్కువ పోస్టులు ఉన్నా కష్టపడితే మాకు ఉద్యోగం వస్తుంది అనే ఆశతో నిరుద్యోగ యువత చదువుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా వారి ఆశలు ఆవిరి అయ్యాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉంది. ఇప్పటికైనా పిచ్చి రాజకీయాలు మాని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జరిగిన తప్పు, మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే సరి. లేదంటే, బీఆర్ఎస్ పేపర్ కూడా వచ్చే ఎన్నిల్లో చినిగిపోవడం ఖాయం.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు జరిగిందే రిపీట్ అయిందా ?
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి రాజశేఖర్, ప్రవీణ్ ఇంకా అనుమానితుల వ్యక్తిగత జీవితం, ఉద్యోగం తర్వాత అతని బ్యాంకు ఖాతాలు, అతని ఎకౌంటు లోకి వచ్చిన డబ్బులు.. నిధులు మళ్లించిన తీరు పైన కూడా అనుమానాలు ఉన్నాయి.. వాటిని కూడా నివృత్తి చేయాల్సిన అవసరం సీట్ కు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ ఆరోపణలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గ్రూప్ వన్ పరీక్షల్లో తన జిల్లాకు సంబంధించిన వారికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అనేక పోరాటాలు చేశారు. అప్పటినుంచి చాలామంది అప్పటి ఏపీపీఎస్సీ పై ఇప్పుడు టీఎస్పీఎస్సీ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని పెన్ డ్రైవ్ లో దాదాపు 46 ప్రశ్న పత్రాలు ఉన్నాయంటే ఏ స్థాయిలో టీఎస్పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యంగా ఉందో చెప్పకనే అర్థమవుతుంది. పేపర్ లీకేజీ పై ఒక స్పష్టమైన అవగాహనతో మాట్లాడింది ఇప్పటివరకు బిఎస్పి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే. మిగతావారికి పూర్తిస్థాయిలో అవగాహన లేనప్పటికీ రాజకీయాలను తెలుపుతూ వీరిమాటలతో విద్యార్థులను మరింత కుంగతీస్తున్నారు. ఇప్పటికైనా చెత్త రాజకీయాలు మానేసి విద్యార్థులకు ఎలాంటి భరోసానిస్తున్నారు టీఎస్పీఎస్సీ ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారు. నష్టపోయిన విద్యార్థులను మళ్లీ చదువు వైపు మళ్ళించడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి. ఇప్పటివరకు జరిగిన పరీక్షలు అన్నిటిపై అపోహలే ఉన్నాయి విద్యార్థులకు … వాటి పరిస్థితి అలాగే వచ్చే పరీక్షల నిర్వహణ పై క్లారిటీ ఇవ్వండి.
నోట్ :- ఓ జర్నలిస్టుగా రాయలేదు టీఎస్పీఎస్సీ పై నమ్మకం పెట్టుకొని ఆశతో చదువుతున్న ఓ భాధిత కుటుంబంలో బాద్యుడిగా ఆర్టికల్ రాశాను
శేఖర్ కంభంపాటి జర్నలిస్ట్ నల్గొండ