Charanparimi: ( Illustrater అను అనామకుడు! )
బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం. ఊర్లో మానాన్న నన్ను ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగికి పరిచయం చేశాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. గవర్నమెంట్ జీతగాళ్ల స్టైల్లో. ఇలస్ట్రేటర్ అంటే అర్థం కాదని పత్రికలో కార్టూనిస్ట్ అన్నా. అంటే బొమ్మలు గీయటమేగా. ఇంకేదన్నా మంచి ఉద్యోగం చూసుకోకూడదు, అన్నాడు.
నాకు మోయే.. మోయే!
అప్పటిదాకా ఈ బొమ్మలు వేయడం ఒక ప్రత్యేకమైనది. చాలా గొప్పది అని ఫీలయ్యేవాణ్ణి. అప్పటినుంచి బొమ్మలు గీస్తాను, అనే మాట నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కింద పరిణామం చెందుతూ వస్తోంది. దీనికి డాక్టర్లు, ఇంజనీర్లు, గవర్నమెంట్ గుమస్తాలకు ఉన్న గౌరవం ఉండదు. పంచాయతీ వార్డు మెంబర్ కూడా కరువు పనికి పేరు రాపించనా అన్నట్టు చూస్తాడు.
ఒక ఫ్రెండుగాడు తన గర్ల్ ఫ్రెండ్ బొమ్మ గీయాలి అని అడిగాడు. సరేననీ గీశా. బొమ్మ కింద ఎలక్టోరల్ బాండ్ మీద పెట్టినంత బాగా సైన్ పెట్టాను. అతను తీసుకుని నా పేరు కొట్టేసి తన పేరు రాసుకున్నాడు .. ఆర్ట్ బై..అమర ప్రేమికుడు. ఆర్టిస్టు సంతకానికి అన్నిచోట్లా విలువ ఉండదు అన్న జ్ఞాన గుళిక అప్పుడుగాని పడలేదు.
ఇప్పుడిది ఎందుకంటే, పత్రికల్లో ఇల్లస్ట్రేటర్ లకు ఏ సంస్థగాని, ఏ వర్సిటీ గాని, ఏ అకాడమీ గానీ, ఎంతో కాలంగా ఒక పురస్కారం ప్రకటించిన పాపాన పోలేదు.
బహుశా సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో దానికి దన్నుగా నిలిచే వాటిలో అత్యంత జఫ్ఫా పని ఇదే అనుకుంటా. బొమ్మలు గీయడం. ఈమధ్య తెలుగు యూనివర్సిటీ వారు కళలకు సంబంధించి అనేక రంగాల వారికి పురస్కారాలు ప్రకటించిన లిస్ట్ చూశాను. అనేకానేక రంగాల వారు ఉన్నారు. సంతోషం. లేనిది ఒకే ఒక్కటి illustration. అయితే చిత్రకళకు ఇచ్చారు. ప్రొఫెషన్ పరంగా రెండూ ఒకటి కాదు. తెలుగులో గత 20 ఏళ్లుగా అద్భుతమైన పని చేసిన గొప్ప పత్రికా చిత్రకారులు ఉన్నారు. వాళ్ళకు కితాబు ఏదీ అని.
“మీది మొత్తం 1000 అయింది. రెండు బొమ్మలు ఎక్స్ట్రా” అని ఒక్క డైలాగ్ తో ఫేమస్ కావచ్చేమో గానీ. ఏళ్ల కృషి మాత్రం ప్రశంసకు నోచుకోదు. అయితేనేం ఆ చిత్రకారులకు గొప్ప అభిమానులు బోలెడుమంది. అదే అతిపెద్ద అవార్డు. నేను బొమ్మలు గీసిన పుస్తకాలకు fbలో 6 పేరాల విశ్లేషణలు, మూడు పేజీల చప్పట్లు చూశాను. అందులో బొమ్మల గురించి ఒక్క ముక్క కనపడదు. ఒక్క ముక్క..! వాళ్లకి కళా హృదయం లేదు అనుకోలేము. బహుశా ఈ పని ignorable అనుకుంటా. వాటి గురించి చెప్పడానికి ఏముంటుంది. ఆ కథకి బొమ్మ గీశావు అంతేగా, అంటే… అంతే కాదు. బొమ్మ పెట్టే పరీక్ష అంతా ఇంతా కాదు. ఈమధ్య మాత్రం నా తోటివాళ్ళు రాసే రివ్యూలలో బొమ్మ గురించి ప్రస్తావన వస్తుంది. నేను గీసిన కవర్ పేజీలకి, కవర్ చూసి పుస్తకం కొనేస్తున్నారు అని రచయితలు అన్నప్పుడు, బొమ్మలు బాగున్నాయి అని పాఠకులు Feedback ఇచ్చినప్పుడూ బోలెడంత సంబరం.
అటు ప్రజల్లోనూ, ఇటూ సిస్టమ్ లోనూ వెనుకే ఉండిపోయిన కళ ఇది. కవిత్వానికి జిల్లాకో సంఘం, నెలకో పురస్కారం ఇస్తుంది. కథకు తగినంత ఉంది. నవలకు అడపాదడపా ఆ భాగ్యం ఉంది. ఆమధ్య Memers కి ఉత్తమ meme, funny meme పేరుతో ప్రముఖ ఛానల్లు పురస్కారాలు ఇచ్చాయి. అందులో సగంమంది ఉత్త ట్రోల్ బ్యాచ్ ఉన్నారు. యూట్యూబ్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసుకొని కోటేషన్స్ చెప్పే వాళ్ళకి కూడా influencer అవార్డులు అంట. వీళ్ళకి ఉన్న మోటివేషన్ చిత్రకారులకు లేకుండా పోయింది. ఇప్పటికే పత్రికల్లో కొత్తగా చిత్రకారులు పుట్టడం లేదు. కారణాలు ఇంకోసారి మాట్లాడుకుందాం.
Illustration కథకి వాల్ పోస్టర్ లాంటిది. రచనకు ముఖం లాంటిది. పుస్తకానికి తోరణం. సాహిత్యానికి ఆభరణం. కాబట్టి ఈ కళ ఒకటి ఉంది అని మరువడం బాధాకరం. సాహిత్య సంస్థలు అనేక ప్రక్రియలతో పాటు దీనిమీద కూడా దృష్టి పెట్టాలి. లేకపోతే సాహితీ సేవ పరిపూర్ణం కానట్టే.