కాంగ్రెస్ పార్టీ మారతాననేది ఊహాగానమే.. తప్పుడు ప్రచారం చేయోద్దు
Nalgonda: కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. బిఆర్ఎస్ అనుకూల మీడియా కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మారే ప్రసక్తే లేదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దును నిరసిస్తూ గాంధీభవన్ పార్టీ చేపట్టిన దీక్షలో పాల్గొన్న విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇటీవల భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పలు గ్రామాల్లో పర్యటించినట్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇటు కోమటిరెడ్డి అభిమానులు ఈవిషయంపై స్పందిస్తూ.. రాష్ట్రంలో మీడియా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని.. తమ నాయకుడిని కావాలని బద్నాం చేసేందుకు దుష్పప్రచారం చేస్తూ కార్యకర్తలను తప్పదోవ పట్టిస్తోందని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. గతంలోనూ కోమటిరెడ్డి పార్టీ మారతాడని కొన్ని మీడియా చానళ్లు పనిగట్టుకొని ప్రచారం చేశాయని..బాధ్యత గల వృత్తిలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని కోమటిరెడ్డి అభిమానులు హితువు పలికారు.