అవినీతి… అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్ : పవన్

Janasena: ‘రాష్ట్రం విడిపోయి దశాబ్ధం అవుతోంది.. ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవ చేశారు  పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది  కథ మూడు గంటల సినిమాతో చెప్పవచ్చు.. అయితే రాజధానికి దారేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేద’ని జనసేన అధ్యక్షులు  అన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని, ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పక్కాగా అమలు చేస్తామనీ… పోలీస్ వ్యవస్థకు పునర్ వైభవం తీసుకొచ్చి, రాజీలేని పోలీసు వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం తీరంలో ప్రతి 30 కిలోమీటర్లకు జెట్టీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.  సుందరపు వెంకట సతీష్ గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  విశాఖలో ఎంవీపీకాలనీలోని ఎ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర అంటే చైతన్యం నిండిన నేల. అందరినీ గుండెలకు హత్తుకునే నేల. తెలుగువాడిలో ఆంధ్ర అనే భావన రగిలించిన నేల. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల. ఇలాంటి ప్రాంతం నుంచి ప్రజలు, యువత జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోవడం బాధ కలిగిస్తోందన్నారు పవన్. జనసేన పార్టీ పెట్టి, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిలబడ్డాను అంటే దానికి ఉత్తరాంధ్ర ఇచ్చిన మనో ధైర్యమే కారణమని.. నాకు నటనలో ఓనమాలు నేర్పించి, నాలో భయాలను పోగొట్టింది. మన తరాన్ని కాపాడుకుంటూ… వచ్చే తరానికి బంగారు భవిష్యత్తు అందించేలా నా వంతు కృషి చేసి ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఈ ప్రాంత యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా నిండు మనసుతో ప్రయత్నిస్తున్నట్లు.. కొద్ది రోజుల క్రితం మత్స్యకారుల బోట్లు కాలిపోతే … బాధితులకు పార్టీ తరఫున రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించానని.. ఆ డబ్బు వాళ్ల కష్టాలు తీరుస్తుందని ఇవ్వలేదని.. కష్టంలో మేము అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లు పవన్ పేర్కొన్నారు.

ముందుండి పోరాటం చేస్తాను అంటే ఒక్కరూ స్పందించలేదు  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడానని పవన్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ లాగా చూడకండన్నారు. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు చేయడం కోసం 32 మంది బలిదానాలు చేశారని.. ప్రతి తెలుగువాడికి చాలా భావోద్వేగంతో కూడుకున్నదని ..అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో చాలా గొడవలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రంతో చెప్పినట్లు వెల్లడించారు. జై తెలంగాణ నినాదానికి ఎంత ఉద్వేగం ఉంటుందో ‘విశాఖ హక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదానికి కూడా అంతే ఉద్వేగం ఉందని చెప్పానని  అన్నారు. ఇవన్ని చెబితేనే కేంద్ర పెద్దలు మన మాటలను గౌరవించి ఇంత వరకు ప్రైవేటీకరణ చేయకుండా ఆపారని.. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులతో మనస్ఫూర్తిగా చెప్పినమాట ఏమిటంటే… మీరంతా కలిసి వస్తానంటే ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి అప్పీల్ చేసి.. గట్టిగా పోరాటం చేద్దాం అని సూచించినట్లు పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ నాయకులకు యువత భవిష్యత్తు పట్టదు 

వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే … కనీసం వాళ్లు సకాలంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారని పవన్ సెటైర్ వేశారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల గురించే తప్ప యువత భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోతున్నారని మండిపడ్డారు. నిజమైన రాజకీయ నాయకులు అయితే ఈ ఐదేళ్లు నిరుద్యోగ యువతకు ఎంత విలువైన కాలమో తెలిస్తే తప్పులు చేయరన్నారు. జ్యాబ్ క్యాలెండర్ సకాలంలో ఎందుకు విడుదల చేయలేకపోయారో కనీసం జవాబు చెప్పేవారు లేరన్నారు. రాజకీయాలు అంటే ఒక బురద.. పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని యువత భావిస్తున్నట్లు.. నిజంగా రాజకీయాల్లో యువత పాత్ర ఉండాలంటే వారి కోసం నిలబడే వ్యక్తులు ఉండాలని పవన్ సూచించారు. దెబ్బ తిన్నా నిలబడే వ్యక్తులు ఉంటే వారు మారుతారని .. తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటే వందల కోట్లు సంపాదించుకోవచ్చునని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని.. కానీ ఆ జీవితం నాకు తృప్తినివ్వదని తేల్చిచెప్పారు. ఒక పాతికేళ్లు కష్టపడి యువతకు మంచి భవిష్యత్తు చూపించగలిగితే వందల కోట్ల కన్నా ఎక్కువ సంతృప్తినిస్తుందన్నారు. ఓటమి విలువ యువతకు బాగా తెలుసునని.. ఏదైనా ప్రవేశ పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి తెలుసని..  దశాబ్ధ కాలంగా ఓటమి మీద ఓటమి తీసుకుంటూ ఎదుగుతున్నానని.. అబ్రహం లింకన్ ఎన్నోసార్లు ఓడిపోయారని.. లాయర్ ఎన్నికలు, సెనేటర్ ఎన్నికలు ఇలా ప్రతీ చోట ఓటమి చవిచూశారని.. అయినా ప్రయత్నం ఆపకపోవడం వల్ల అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని పవన్ గుర్తు చేశారు.

Optimized by Optimole