తెలంగాణలో బీజేపీ ఓటమిపై కేంద్రం యాక్షన్ ప్లాన్?

BJPTelangana: తెలంగాణలో బీజేపీ ఓటమి పై కేంద్ర నాయకత్వం యాక్షన్ ప్లాన్..కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలి? బండి, ఈటల…. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరు బెస్ట్?అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో ఏ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి లాభించాయి?పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించేదెలా?కసరత్తు మొదలుపెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం.పార్లమెంట్ సమావేశాల తరువాత యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్న బీజేపీ.

తెలంగాణలో బీజేపీ దారుణంగా ఎందుకు ఓడిపోయింది? బీజేపీ  8  స్థానాలకు మాత్రమే ఎందుకు పరిమితమైంది?   ఆ ఎనిమిదింటిలోనూ బండి సంజయ్, ఈటల ఛరిష్మా పనిచేసిందా? రాబోయే  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలి? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కొనసాగించాలా? వద్దా?  రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ ఎంపీ సీట్లు రావాలంటే ఏం చేయాలి?… అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదం పనిచేసిందా? లేదా?…. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నినాదం పనిచేస్తుందా? లేదాా? ..బీజేపీ జాతీయ నాయకత్వం గత కొద్దిరోజులుగా ఇవే అంశాలపై కసరత్తు చేస్తోంది.  

రాబోయే ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి తొలి వారంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా మెజారిటీ ఎంపీ సీట్లు సాధించి ప్రధానిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పావులు కదుపుతోంది.  ఈ నేపథ్యంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలేమిటి? అందులో ఎవరి పాత్ర ఎంత? ముఖ్యంగా తెలంగాణలో టాప్ లీడర్లుగా చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తోపాటు బండి సంజయ్, ఈటల రాజేందర్ లలో ఎవరి ఛరిష్మా పనిచేసింది? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీరిలో ఎవరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలి? అదే సమయంలో ఎవరి  సేవలను  ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి? అనే అంశాలపై కసరత్తు మొదలైంది. 

దీనికితోడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తారనే వార్తలు వెలువడటంతో తదుపరి అధ్యక్షుడెవరు? అసలు ఏ సామాజికవర్గం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఉంది? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో బలపడే అవకాశాలున్నాయి?  అనే అంశాలపై జాతీయ నాయకత్వం ద్రుష్టి సారించింది. ఫలితాలను విశ్లేషిస్తే….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాల్లో గెలిచింది.  వీటిలో ఆదిలాబాద్,  ముథోల్, నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, అర్మూర్, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి? అదే సమయంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి ఛరిష్మా కలిగిన నాయకులు, స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకు ఓడిపోయారు? మరి గెలిచిన 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అంశాలు కమలం పార్టీని తీరానికి చేర్చాయి?… ఏ నాయకుడి ప్రభావం ఆయా నియోజకవర్గాలపై పడింది? అనే అంశాలు కూడా పార్టీ అధిష్టానం లోతుగా విశ్లేషిస్తోంది. 

ఇప్పటి వరకు పార్టీ సేకరించిన సమాచారం మేరకు….. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధానంగా 5 కారణాలున్నాయని తెలిసింది. అందులో మొదటిది  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ ను అకారణంగా తప్పించడం 2. లిక్కర్ స్కాంలో ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసిన కేంద్రం కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకోకపోవడం 3. హిందుత్వ నినాదాన్ని పూర్తిగా వాడుకోకపోవడం 4. ఈటల రాజేందర్ కు బీజేపీలో అనవసరంగా  ప్రాధాన్యత ఇవ్వడం 5. రెండుసార్లు అధ్యక్షుడిగా వైఫల్యాన్ని మూట గట్టుకున్న కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం…. ఈ 5 అంశాలే బీజేపీ దారుణ ఓటమికి ప్రధాన కారణాలని భావించిన జాతీయ నాయకత్వం తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. 

అందులో భాగంగా బీజేపీ గెలిచిన 8 అసెంబ్లీ స్థానాల్లో ఏయే అంశాలు పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడ్డాయనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, ప్రాథమిక సమాచారం మేరకు…. తెలంగాణలో బీజేపీ గెలిచిన 8 అసెంబ్లీ స్థానాల్లో ప్రధానంగా హిందుత్వ నినాదం,  బండి సంజయ్ సామాజికవర్గ ఓట్లే కీలక పాత్ర వహించాయిని తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణలో మున్నూరుకాపు సామాజికవర్గ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. వీటితోపాటు బీజేపీ గెలిచిన ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో హిందుత్వ నినాదం సత్ఫలితాలనచ్చింది.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మున్నూరు సామాజికవర్గం అధికంగా ఉంది. కానీ ఇక్కడి నుండి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముగ్గురు మున్నూరుకాపు కులానికి చెందిన వారే కావడంతో ఈ ఓట్లన్నీ చీలాయి.  అదే సమయంలో ముస్లిం ఓట్లు 70 వేలకుపైగా ఉండటంతో మైనారిటీలంతా బండి సంజయ్  కు వ్యతిరేకంగా ఓటేయడంతో ఆయన 3 వేల ఓట్లతో ఓడిపోయారు. 

కానీ ఈటల రాజేందర్ సామాజికవర్గమైన ముదిరాజ్ ఓటర్లు బీజేపీకి ఎందుకు ఓటేయలన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న?.  ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ తోాపాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో  ముదిరాజ్ (బెస్త, గంగపుత్ర, తెనుగ, ముదిరాజ్) ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థులు ఎందుకు గెలవలేకపోయారు? ప్రధానంగా ముదిరాజ్ ఐకాన్ గా ఉన్న ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థులెవరూ ఎందుకు గెలవలేకపోయారు? అనే దానిపై బీజేపీ నాయకత్వం ద్రుష్టి సారించింది. 

బీసీ నినాదం ఈ ఎన్నికల్లో పెద్దగా పనిచేయకపోయినప్పటికీ… బీజేపీవైపు మున్నూరు కాపు ఓటర్లు ఉన్నారని పార్టీ గ్రహించింది.  అదే సమయంలో రెడ్లు మెజారిటీ గా కాంగ్రెస్ వైపు వెళ్లారని, వెలమ సామాజికవర్గం మెజారిటీ గా బీఆర్ఎస్ వైపు  వెళ్లారని, మెజారిటీ వైశ్య. బ్రాహ్మణ సామాజికవర్గ ఓట్లు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు,  ఉత్తర తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కు పడ్డాయని భావిస్తోంది.  అట్లాగే తెలంగాణలో ఫలితాలను ప్రభావితం చేసే గౌడ, యాదవ్, పద్మశాలి, రజక, నాయి బ్రాహ్మణ వంటి బీసీ సామాజికవర్గ ఓటర్లతోపాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు గ్రహించిన బీజేపీ అధిష్టానం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా సామాజికవర్గ వర్గాలను తమవైపు మళ్లించుకునేందుకు ఏం చేయాలి? పార్టీలో సంస్థాగతంగా ఏయే మార్పులు చేయాలి? అనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించి నూతన అధ్యక్షుడిని నియమించే అంశంపైనా పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాీల అనంతరం తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగడం తథ్యమని ఆ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.