జగన్ మామ మోసం… విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం: నాదెండ్ల మనోహర్

Janasenaparty: ‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్ మామ… పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. పిల్లల  భవిష్యత్  ప్రశ్నార్థకం అవుతోందని.. ఇంగ్లీష్ మీడియం పేరుతో హడావుడి చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అని న్యాయస్థానం చెప్పడంతో సీబీఎస్ఈ సిలబస్ విధానం తెచ్చారని.. తీరా ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు కనీసం పరీక్షలు రాసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ‘‘సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలో ఉన్న 44,369 పాఠశాలల్లోనూ అందిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఆ సిలబస్ అనుమతి కోసం సీబీఎస్ఈ బోర్డు స్కూలుకు రూ.లక్ష ఫీజు చెల్లించాలని.. ఆ బోర్డు చెప్పిన నిబంధనలు, నియమాలు పాఠశాలల్లో తప్పక అమలు చేయాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కేవలం 1000 పాఠశాలలకు మాత్రమే కేంద్రం నుంచి సీబీఎస్ఈ అనుమతి తీసుకొందని.. అదీ కేంద్ర ప్రభుత్వం ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తే.. ఈ పాఠశాలల్లో రాష్ట్రం మొత్తం మీద 85,353 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని వెల్లడించారు.  పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు సంబంధించి సీబీఎస్ఈ సిలబస్ మేరకు మరో రెండు నెలల్లో వార్షిక పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ వారి భవిష్యత్తుపై ఉదాసీనతతో వ్యవహరిస్తోందని  మండిపడ్డారు. ఎందుకంటే వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయిందని..అసలు వారు ఏ మాధ్యమంలో పరీక్షలు రాయాలో, వారి పరిస్థితి ఏమిటో తెలియని ఆగమ్యగోచర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఎస్ఈ నిబంధనలు అమలు కావడం లేదు ..

విద్యార్థులకు మరో రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయన్నారు మనోహర్. రూ.2,56,05,900 లు ఫీజులు కింద చెల్లించాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ దానిపై కిమ్మనడం లేదని.. ఇలాగైతే విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారా? ఒకసారి విద్యార్థుల తల్లితండ్రులు ఆలోచన చేయాలని సూచించారు. సీబీఎస్ఈ బోర్డు నిబంధనల మేరకు అనుమతి ఉన్న పాఠశాలల్లో నిర్దేశిత నియమాలు, నిబంధనలు అమలు చేయాలన్నారు. బోధనకు అనువైన మౌలిక వసతులు కచ్చితంగా ఉండాలని డిమాండ్ చేశారు. సైన్సు ల్యాబోరేటరీలు వేయి పాఠశాలలకుగానూ కేవలం 732 పాఠశాలల్లో ఏర్పాటు చేశారని .. గ్రంథాలయాలు కూడా 721 పాఠశాలల్లోనే ఉన్నాయన్నారు. కంప్యూటర్ ల్యాబోరేటరీలు కూడా 454 పాఠశాలల్లో ఏర్పాటు చేశారని.. సీబీఎస్ఈ  పిల్లలకు 44 వేల కంప్యూటర్స్ ఉండాల్సి ఉండగా.. కేవలం 12,214 కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి స్కూల్ కీ పరీక్షల నిమిత్తం రెండు ప్రింటర్స్, స్కానర్స్ కావాల్సి ఉంటే వాటినీ సైతం సమకూర్చాలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మనోహర్ స్పష్టం చేశారు.

స్టూడెంట్ కౌన్సిలర్లు ఎక్కడ?

కంప్యూటర్ టీచర్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదన్నారు నాదెండ్ల. 489 పోస్టులు మాత్రమే తీసుకున్నారని తెలిపారు. మిగిలిన వాటి భర్తీకి కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి పాఠశాలకు స్టూడెంట్ కౌన్సిలర్ పోస్టు కచ్చితంగా ఉండాలని నిబంధన ఉంటే కనీసం ఏ పాఠశాలలో ఆ పోస్టును భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు.ఒకేషనల్ ట్రైనర్స్ కూడా 573 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని అన్నారు. ఇలా అరకొరగా సౌకర్యాలను కల్పిస్తే పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారు..? సిలబస్ ను ఎలా అర్ధం చేసుకుంటారని ప్రశ్నించారు. సీబీఎస్ఈ సిలబస్ వేయి పాఠశాలలకు అనుమతి తీసుకొంటేనే ఇంత గందరగోళం ఉంటే, ఐబీ సిలబస్ పేరిట పిల్లలకు అంతర్జాతీయ వసతులను కల్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారు..? పిల్లలకు పాఠాలు ఎలా అర్ధం అవుతాయి..? దీనిపై తక్షణం ప్రభుత్వం సమాధానం చెప్పాలని  మనోహర్ డిమాండ్ చేశారు.