జనసేన ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది: నాదెండ్ల మనోహర్

బెజవాడ కృష్ణమ్మ జన సునామీతో ఉప్పొంగిందా..? బందరు సముద్ర తీరం ముందుకు వచ్చిందా అన్నట్లు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఇంత జనమా? అనే ఆశ్చర్యం కలిగే రీతిలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా  బుధవారం మంగళగిరి లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  మనోహర్, పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వారాహి వాహనం పైకి పవన్ కళ్యాణ్ గారు ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన దగ్గర నుంచి సభ దగ్గరికి వెళ్లే వరకు లక్షలాదిమంది జనసైనికులు, ప్రజలు ఆయనకు పలికిన స్వాగతం అపూర్వమైనదని కొనియాడారు.  బెజవాడ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేనంతగా రోడ్డు షో విజయవంతం అయ్యిందన్నారు. అభివాదం చేస్తూ, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, వారి ఆశీస్సులు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవాడలో విజయవంతం కావడం ఒక గొప్ప  సంకేతంగా నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా  పవన్ కళ్యాణ్  మాట కోసం ఎదురు చూశారని.. సభా వేదిక వద్దకు జనసేనాని రావడం సుమారు 5 గంటలకు పైగా ఆలస్యమైనా ఎవరూ కనీసం చెక్కుచెదరకుండా ఓపికగా సభాస్థలి వద్ద వేచి చూడడం ఓ గొప్ప మార్పునకు నాందిగా భావిస్తున్నట్లు నాదెండ్ల పేర్కొన్నారు.

సమన్వయం, ప్రణాళిక అద్భుతం..

కార్యక్రమం విజయవంతానికి పూర్తి సమన్వయంతో, ఐక్యమత్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్  తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు మనోహర్. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆవిర్భావ సభకు అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేసిన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కు ప్రత్యేక అభినందనలు అంటూ కొనియాడారు. మంచి ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం బాగుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కడా ఇబ్బంది పడకుండా పార్కింగ్ దగ్గర నుంచి భోజనాల ఏర్పాట్లు వరకు చక్కగా చేయడం అందరితో శభాష్ అనిపించుకుందన్నారు. చాలామంది తమ విధులు మానుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభకు వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడం ఆనందం కలిగించిందన్నారు. వరుసగా రెండు రోజులపాటు పార్టీ  వాలంటీర్లు పడిన కష్టం గొప్పదని.. పార్టీ సభ నిర్వహణలో పూర్తిస్థాయిలో సహకరించిన విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీలతో పాటు పోలీసు సిబ్బంది అందరికీ  పవన్ కళ్యాణ్  తరఫున మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.