తెనాలి: తెనాలిలో సీఎం జగన్ పర్యటనపై జన సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు.సీఎం పర్యటన ఉంటే ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో సేవలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా ఆగిపోయినందున ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం లేదని చెప్పడంతో మూడు నిండు ప్రాణాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం సభ కోసం తరలిస్తున్న భారీ జనరేటర్ వాహనాన్ని గరువుపాలెం దగ్గర ఆటో ఢీ కొని ముగ్గురు మృతి చెందిన ఘటన బాధ కలిగించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలిస్తే విద్యుత్ సదుపాయం లేక వైద్య సేవలు నిలిచిపోవడంతో గుంటూరు, ఇతర ఆసుపత్రులకు తరలించాలని చెప్పడం అత్యంత దురదృష్టకరమని మండి పడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన ఉందని ఆ మార్గంలో విద్యుత్ నిలిపివేయడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిండిపాలెం గ్రామానికి చెందిన మృతులు కష్ట జీవులు. ఆ కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. క్షతగాత్రులకు పరిహారంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాదెండ్ల విజ్ఞప్తి చేశారు.