జగ్జీవనరామ్ కాంగ్రెస్ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!
Nancharaiah merugumala senior journalist:
‘ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్..కాంగ్రెస్ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!’
కాంగ్రెస్ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్ దళిత దిగ్గజం బాబూ జగ్జీవనరామ్ అంటే మా తరంలో చాలా మందికి ఇష్టముండేది కాదు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ బాబాసాహబ్ బీఆర్ అంబేడ్కర్ గారికి వ్యతిరేకంగా బాబూజీని వాడుకుందనీ, అనసూచిత కులాల ప్రజలను కాంగ్రెస్ లోనే ఉండేలా చేసిన సర్కారీ దళిత నేత జగ్జీవనుడని మాకు ‘మా పెద్దలు’ కొందరు చెప్పేవారు. కాంగ్రెస్ వ్యతిరేకతే ఐడెంటీగా మరిన మాకు ఈ మాటలు నచ్చేవి. అయితే, నాటి ప్రధాని ఇందిరమ్మ లోక్ సభ ఎన్నికలు ప్రకటించగానే 1977 ఫిబ్రవరిలో జగ్జీవనరామ్ ‘కాంగ్రెస్ బందెలదొడ్డి’ నుంచి బయటపడ్డారు. అప్పుడాయన మా తరం యువకులకు దేవుడిలా కనిపించాడు. బాబూజీ దేశంలోని చర్మకార కులాలవారికి, చర్మకారేతర అనుసూచిత కులాలకు, ఆదివాసీలకు ఏం చేశారనే విషయం మాకు పెద్దగా పట్టలేదు. మాకు ఆయనలో నచ్చిందల్లా ప్రధానమంత్రి పదవిని అడ్డంపెట్టుకున్న ప్రజాస్వామ్య నియంత ఇందిరమ్మను ఎదిరించి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఆమెపై యుద్ధం ప్రకటించడమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే–జగ్జీవన్ రామ్ 1980ల ఆరంభంలో కాంగ్రెస్–జే అనే ఓ బుల్లి పార్టీ నడిపారు. 1983లో ఈ పార్టీ (కాంగ్రెస్–జే) తరఫున బద్వేలు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన ఫ్యాక్షనిస్టు నేపథ్యం ఉన్న నాయకుడు బిజివేముల వీరారెడ్డి గారు 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ తరఫున నిలబడ్డారు. తర్వాత తెలుగుదేశంలో చేరారు. కాని, బాబూజీకి ఆయన ఏకైక కుమారుడు సురేష్ రామ్ వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కూతురు మీరా కుమార్ తిరిగి కాంగ్రెస్ లో చేరి తండ్రి ‘పాపాన్ని’ ఏఐసీసీ ఆఫీసు వాకిట్లో కడిగేసుకున్నారు. అందుకే ఆమె లోక్ సభ స్పీకరయ్యారు. తండ్రి బాబూజీని అంబేడ్కర్ సాహబ్ పై ఆయుధంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఐఎఫ్ ఎస్ అధికారిణి అయిన మీరా కుమార్ ను 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ దళిత అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ పై పోటీకి దింపింది. కోవింద్ కూడా చర్మకారేతర కోరీ అనే ఎస్సీ కులానికి చెందిన నేత.