ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోటిచేసే అభ్యర్థులతో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన తెలుగు చానళ్లలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన జర్నలిస్టులు.. జగన్ సొంత మీడియాలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తి, ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న పేరున్న జర్నలిస్ట్ సైతం టికెట్ కోసం లాభియింగ్ చేస్తున్నట్లు మీడియా సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఎమ్మెల్సీ సీటు కాకరేపుతోంది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే నుంచే సీటు కోసం కాచుకొని కూర్చున్న కొంతమంది జర్నలిస్టులు.. వైసీపీలోని సీనియర్ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు ప్రముఖ చానల్స్ కి చెందిన సీనియర్ మహిళా రిపోర్టర్లు తమకున్న పరిచయాలతో లాభియింగ్ మొదలెట్టారని.. గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్లు ప్రచారం జరుగుతుంది.
అటు సీఎం సొంతమీడియాలోనూ ఉన్నత స్థానంలో ఉన్న ఓవ్యక్తి రిటైర్మెంట్ దగ్గరపడుతుండటంతో
ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రిటైరన జర్నలిస్టులు సైతం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రిటైర్ జర్నలిస్టు .. మాటలో మాటగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనని.. పోటి ఎక్కువగా ఉండటంతో కష్టమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
ఇదిలా ఉంటే.. మీడియా సలహాదారుల విషయంలో హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వారిలో ఎవరో ఒకరికి ఈసీటు కేటాయించే యోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే.. ప్రభుత్వ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ముఖ్య సలహాదారునికి ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టే చాన్స్ లేకపోలేదన్నది నిపుణులు మాటగా తెలుస్తోంది.
మొత్తంగా ఏపీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలవడంతో రకరకాల వార్తలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి.. ఇంతకు వైసీపీ అధినేత మనసులో ఏముందన్నది అంతుచిక్కని జవాబు.