యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన.. కానీ అతని రక్తం మాత్రం కాదు ” అంటూ ఉండే పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్.. మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం నా మనసులో పడ్డ ఆలోచనకు రూపమే ఈ సినిమా. దీన్ని ఎలా డిజైన్ చేయాలో అప్పుడే నిర్ణయించుకున్నా. ఎన్నాళ్లుగానో కలలుకంటున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ .. నా డ్రీం హీరోతో చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే.. ప్రశాంత్ నిల్ సినిమా పట్టాలెక్కనుంది.