Jublihills:
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నేతల సవాళ్లు–ప్రతిసవాళ్లతో ఉప ఎన్నిక హీటెక్కింది. తాజాగా ఉప ఎన్నిక పోరులో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. పీజేఆర్ వారసులైన అక్క–తమ్ముడు మధ్య సాగుతున్న సవాళ్లు_ ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్‌లో ఎగరేస్తానని అక్క విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ జెండా ఎగరనీయనని తమ్ముడు విష్ణు వర్ధన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కతమ్ముడు మధ్య పాత విభేదాలకు ఈ ఉప ఎన్నిక మళ్లీ అగ్ని రాజేసినట్టైంది.
ఇక మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువనర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…తాను ఉన్నంతకాలంలో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనని..మాగంటి గోపీనాథ్ కుటుంబానికి తాను బాబాయ్‌లా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. “కాంగ్రెస్ పార్టీ నన్ను డబ్బులు అడిగిన పార్టీ… అందుకే దూరమయ్యాను” అని ఆరోపించారు. బీఆర్ఎస్ తనకు కష్టకాలంలో అండగా నిలిచిందని, సునీత గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.
ఇక విష్ణు వ్యాఖ్యలపై పీజేఆర్ కూతురు విజయారెడ్డి కౌంటర్ ఇచ్చారు. “జూబ్లీ హిల్స్ అంటే పీజేఆర్… పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ” అని ఆమె తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను గెలిపించడం పీజేఆర్‌కి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని స్పష్టం చేశారు. “ఎవరికి నచ్చింది వారు మాట్లాడొచ్చు… కానీ పీజేఆర్‌కి నచ్చింది మాత్రం కాంగ్రెస్ జెండానే” అని ఆమె కుండబద్దలు కొట్టారు.
మొత్తంగా అక్క సవాలు గెలుస్తుందా… తమ్ముడు శపథం నెరవేరుతుందా అన్నది రాబోయే 30 రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా కుటుంబ విభేదాలు, నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మార్చేశాయి.