MLCKAVITHA: ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీపై మరోసారి ధిక్కార స్వరం వినిపించింది.ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించింది. భారత దళాలకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్టులు మినహా ప్రత్యక్ష కార్యక్రమాలు చేపట్టలేదు. తాజాగా ఆమె ర్యాలీ ప్రకటనతో బిఆర్ఎస్ పార్టీని వీడి వేరు కుంపంటి పెడుతుందన్న వాదనలకు బలం చేకూరినట్లు అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా బిఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి కవిత అసంతృప్తితో రగిలిపోతోంది.తన రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను కేసీఆర్ పరోక్షంగా తెలియజేయడంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు వార్తలు వినిపించాయి. అందుకనుగుణంగానే మేడే రోజు ఏర్పాటు చేసిన సభలో కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో భౌగౌళిక తెలంగాణ మాత్రమే తెచ్చుకున్నాం.. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి. దీనికి తోడు పార్టీ అంతర్గత విషయాలపై తండ్రి కేసీఆర్ కు ఆమె లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనికి కొనసాగింపుగా ర్యాలీకి పిలుపునివ్వడం చూస్తుంటే ఆమె బిఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది