Hyderabad:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో తన తండ్రి కెసిఆర్ ఫోటోకి బదులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.దీనికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఆమె కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం లక్ష్యంగా కవిత భారీ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ, రెండు నెలల పాటు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, తన రాజకీయ ప్రయాణాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే కవిత వ్యూహంగా కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్ పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటివరకు కార్యక్రమాల్లో కేసీఆర్ ఫోటోలను పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇకపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ కేసీఆర్ ఫోటోను వాడకూడదని కవిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఫోటోకు బదులుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలతోనే పోస్టర్లు, బ్యానర్లు, ప్లెక్సీలు రూపొందించాలని జాగృతి శ్రేణులకు సూచించినట్లు తెలిసింది.