కేరళలో జికా వైరస్ విజృంభణ!

కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తన్నారు. మరో వైపు కేరళలో కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా..తాజాగా ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి.

కేరళలో జికా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. వ్యాధి సోకిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 35కు చేరింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 11గా ఉంది.

ఇన్ని రోజులు.. కేసులన్నీ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచే నమోదయ్యాయి. కానీ తాజాగా.. ఎర్నాకులంలోనూ ఓ కేసు బయటపడింది.
తిరువనంతపురంలో ఓ ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకింది. వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కట్టడి దిశగా అనేక చర్యలు తీసుకుంటోంది.