Telangana:
కేసిఆర్ కుటుంబంలో గత కొంత కాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగనుందా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్ తనయ కవిత, కేసీఆర్ తనయుడు కేటీఆర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బిఆర్ఎస్ పెద్దలు రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. కవితకు పార్టీలో తగిన ప్రాధన్యతిచ్చి ఆమె సేవలను పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు కేటీఆర్ కూడా సమ్మతించినట్టు పార్టీలో ప్రచారం జరగుతోంది. కవిత ఇష్యుపై గతంలోనే పార్టీ అధినేత కేసీఆర్…‘‘చెల్లితో ఏంటీ తగువ…గొడవలు’’ అని కేటీఆర్‌కు ఒక సందర్భంలో హితోక్తి చేసినా కేటీఆర్ పెడచెవిన పెట్టాడని ప్రచారం జరిగింది. మేనబావ హరీశ్‌రావుతో పట్టింపులకు పోకుండా సయోధ్యకు వెళ్లిన కేటీఆర్.. చెల్లి విషయంలో మంకుపట్టు పట్టడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చిందని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
బిఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకడం లేదని కవిత సన్నిహితుల వద్ద వాపోయింది. ఇక సభ తీరు తెన్నులపై అధినేత కేసీఆర్ కి రాసిన లెటర్ లీక్ కావడంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తండ్రి కేసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని..తనని కేసిఆర్ కి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. ఈ విషయంపై పార్టీ అధినేత కేసీఆర్‌కు కొంత మంది లేనిపోని అపోహలు కలిగించేలా తప్పుడు సమాచారం ఇస్తూ బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తున్నారని, దీన్ని ఎండగట్టాలనే కవిత కొన్ని తీవ్ర విమర్శలు చేశారే తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్ధేశించి ఆమె మాట్లాడలేదని పార్టీ శ్రేయోభిలాషులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంత వరకు కవిత ఎవరినీ పేరు పెట్టి విమర్శించలేదని వారు గుర్తు చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కవిత కృషి చేస్తుంటే కొందరు కావాలనే కుటుంబ సభ్యుల మధ్య దూరం పెంచుతూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, దీనికి ముగింపు పలకాలని పార్టీ పెద్దలు కేటీఆర్ దృష్టికి తేవడంతో ఆయన మెత్తబడినట్లు సమాచారం అందింది.
బిఆర్ఎస్ అధిష్టానం తో సంబంధం లేకుండా కవిత కొంతకాలంగా తెలంగాణ జాగృతి తరఫున అనేక కార్యక్రమాల్ని చేపట్టింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేలా పోరాడుతోంది. దీంతో ఆమెపట్ల బడుగు బలహీన వర్గాల్లో సానుకూలత ఏర్పడుతున్నట్టు పార్టీ శ్రేణుల నుండి పార్టీ అధిష్టానానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలిస్తే పార్టీకే ప్రయోజనమని పార్టీ శ్రేణులు బీఆర్‌ఎస్ పెద్దలకు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లపైనే కాకుండా కార్మికుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, బనకచర్ల ప్రాజెక్టు, ఫించన్ల పెంపు, మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500 పంపిణీ వంటి అంశాలపై కవితకు పార్టీ మద్దతు లభించకపోయినా ఆమె పూర్తి స్థాయిలో పోరాడుతున్నారని..ఆమె చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడిందని బిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె సేవలను పార్టీలో ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ సానుభూతిపరులు పార్టీపై తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో కేటీఆర్ చెల్లి కవితతో రాజీకి సిద్దమవుతున్నారాన్న ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్‌కు కాళేశ్వరంపై నోటీసులిచ్చిన అంశంలో కూడా కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి బీఆర్‌ఎస్ శ్రేణుల కంటే అధికంగా నిరసనలు చేపట్టి ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లారని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక ఈ విషయంలో ఆమె తండ్రిపట్ల తనకున్న విధేయతను కూడా చాటుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కవిత కుటంబ సభ్యులతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయనే ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఆందోళన నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కేసును కొనసాగిస్తున్న దశలో కవితకు సంబంధించిన మనుషులు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సిట్ ముందు నోరు తెరిస్తే చెల్లికి సంబంధించి ఫోన్లను ఆన్న ట్యాపింగ్ చేశారనే అపవాదుతో కేటీఆర్‌కు మరింత చిక్కులు తప్పవు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆయన రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ చెప్పడంపై మాట్లాడుతూ కేటీఆర్ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాప్ చేశారని విమర్శించడం గమనార్హం. కాంగ్రెస్ కవితకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్ అంశం ఉదృతం కాకముందే అన్న – చెల్లి కలిసిపోతే ఏ సమస్య ఉండదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రాజకీయాల్లో అన్నా చెల్లెల పోరుపై బీఆర్‌ఎస్ వర్గాలు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉదంతాన్ని కేటీఆర్ ముందు ప్రస్తావించాయి. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిలా మధ్య రాజకీయ పోరుతో ఇద్దరూ నష్టపోయారనే ఉదహరణను బీఆర్‌ఎస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ వారసులు అన్నా చెల్లి మధ్య ఘర్షణతో టీడీపీ లాభ పడిరదని, ఇక్కడ కూడా రక్తం పంచుకున్న కవిత, కేటీఆర్ పోరుతో బయటవారు లాభ పడకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు కొందరు రాజీకి నడుం కట్టారు. షర్మిలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేక నష్టపోయారని, ఇప్పుడు అధికారంలో లేని కేటీఆర్ చెల్లి కవితతో ఘర్షణ పడకుండా సయోధ్య కుదుర్చుకోవాలని పార్టీ పెద్దలు చేసిన సూచనకు కేటీఆర్ సమ్మతించారని తెలుస్తోంది.
షర్మిలతో పోలిస్తే కవిత రాజకీయ పంథానే వేరు. షర్మిలా ఎప్పుడూ ప్రజలచే ఎన్నుకోబడలేదు. అయితే గతంలో నిజామాబాద్ లోక్ సభ ఎంపీగా గెలిచిన కవితకు ప్రజల్లో ఆదరణ ఉంది. ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన కవితకు జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది. జాతీయ నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర నేతలు ఆమెను తరచూ కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటే పార్టీకి మంచి ప్రయోజనంగా ఉంటుందనే ఆలోచనను కూడా పార్టీ పెద్దలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కవిత వామపక్ష పార్టీలతో, ప్రజా సంఘాలతో కూడా కలిసికట్టుగా నడుస్తుండడంతో ఆ వర్గాల్లో కూడా ఆమె పట్ల సానుకూలత ఏర్పడడం బీఆర్‌ఎస్‌కు లాభిస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
రాష్ట్రంలో బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనేలా పేరు సంపాదించిన చెల్లి కవితపై అన్న కేటీఆర్ సానుకూలంగా ఉంటే పార్టీకి మరింత మేలు చేస్తుందని, ప్రధానంగా మహిళల్లో సానుభూతి పెరుగుతుందని బీఆర్‌ఎస్ మహిళా నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక తెలంగాణ జాగృతి తరఫున చేపట్టిన పలు స్వచ్ఛంద కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో కవితకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. బీఆర్‌ఎస్ కవితకు ప్రాధాన్యత తగ్గించాలని చూస్తున్నా ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆమె వెంట ఉండడంతో కేటీఆర్ చెల్లి కవితతో రాజీకి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
బీసీ ఆర్డినెన్స్‌పై పోరాడిన కవితకు క్రెడిట్ దక్కుతుండడంతో తట్టుకోలేని తీన్మార్ మల్లన్న అక్కసుతో వ్యక్తిగతంగా కవితను పరుషజాలంతో దూషించడం రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై అధికార కాంగ్రెస్‌తో సహా అన్ని పక్షాలు తీన్మార్ మల్లన్నను తప్పుపట్టినా, బీఆర్‌ఎస్ అధికారికంగా తగిన రీతిలో స్పందించకపోవడంపై పార్టీ కింద స్థాయి నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మహిళా నేతపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా, కవితకు మద్దతుగా పార్టీ స్పందించి ఉంటే బీఆర్‌ఎస్‌కే ప్రయోజనం చేకూరేదని పార్టీ శ్రేణులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇంతకాలం జరిగిన నష్టం చాలు, ఇకపై కలిసికట్టుగా సాగితే బీఆర్‌ఎస్‌కే లాభం అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌తో సమానంగా తెలంగాణ జాగృతి కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడుతోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ – కవిత రాజీ కుదుర్చుకుంటే అధికార కాంగ్రెస్‌కు చుక్కలే కనిపిస్తాయని పార్టీ పెద్దల,శ్రేయోభిలాషుల ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని రాఖీ పండుగ కంటే ముందే చెల్లితో సయోధ్య కుదర్చుకునేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతుంది.