ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ చెరిగిపోతోంది. రూల్స్ బుక్ లో ఉన్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఖద్దరు నాయకుల కాళ్లకు దండం పెట్టే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా ఉండాలని రూల్స్ చెప్తున్నా, ప్రస్తుతం నిజాయితీ అనే మాటను వింత పదంగా చూసే పరిస్థితి దాపురించింది. వ్యవస్థలో కింది స్థాయి పంచాయతీ సెక్రెటరీ నుంచి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి అయిన చీఫ్ సెక్రెటరీ వరకు ఇదే స్థితి.
రాజకీయ నాయకులకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి పదవులు దక్కుతాయని అధికారులు భావిస్తున్నారు. *రాజకీయ నాయకులు సైతం రూల్స్, గీల్స్ అనే ముచ్చట చెప్పే అధికారులను కాకుండా తాము చెప్పిన పని చేసే వారికే ఉన్నత పదవులు దక్కేలా చూస్తున్నారు.* ఈ పద్దతి ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అలాగే ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకు నచ్చిన వారే ఎస్సైలు, సీఐలు, తహసీల్దార్లు అవుతున్నారు. నచ్చిన వారికి అడిగిన పదవులు ఇస్తున్నారు. నచ్చని వారికి ప్రధాన్యత లేని పోస్టులు ఇవ్వడం, ట్రాన్స్ ఫర్లు చేయడం, చివరకు వేధింపులకు దిగడం కామన్ అయ్యాయి. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు సైతం రాజకీయనాకుల ముందు మోకరిల్లడం చూస్తేనే ఉన్నాం. రాజకీయ నాయకుల పదవీ కాలం 5 ఏండ్లు, మాది 55 ఏండ్లు అని ప్రభుత్వ అధికారులు గొప్పగా చెప్పుకునే వారు. కానీ, 5 ఏండ్ల పదవుండే నాయకుల దగ్గరే జీ హుజూర్ అంటూ నిలబడుతున్నారు. పోస్టింగ్స్ కోసం రాజకీయ నాయకుల లెటర్ హెడ్స్ తీసుకునే పరిస్థితి దాపురించింది. *ప్రస్తుతం ఏ పోస్టు కావాలన్నా రాజకీయ నాయకులు ఇచ్చే లెటర్ హఎడ్ ద్వారానే జరుగుతుంది అనేది కాదనలేని వాస్తవం.* పొలిటీషియన్స్ ఇచ్చే రికమెండేషన్ లెటర్ ద్వారా పదవులు తెచ్చుకున్న అధికారులు, సదరు నాయకుల కోసం పని చేయడం తప్ప, ప్రజల కోసం పని చేసే పరిస్థితి ఉండటం లేదు. అధికారులే వాళ్ల సామర్థ్యాన్ని బట్టి పోస్టింగ్ ఇవ్వగలిగితే ప్రజల కోసం ప్రజలకు నచ్చే విధంగా ఉద్యోగం చేయగలుగుతారు. ఎందుకంటే పోస్టింగ్ ఇచ్చేది నాయకులు కాదు కదా అధికారులు.
వాస్తవానికి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్లు చేయాలని, వాడు ఆడించినట్లు ఆడాలని రూలేమీ లేదు. కానీ, తమ అవసరాల కోసం రాజకీయ నాయకులకు ఊడిగం చేసే పరిస్థితి దాపురించింది. *అధికారులపై పెత్తనం చేయాలని రాజకీయ నాయకులు భావిస్తే, వారితో మనకెందుకు చెప్పినట్లు చేద్దాం అని చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు పలువురు అధికారులు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ బీఆర్ఎస్ మండల పార్టీనాయకుడిని ఇంటి కరెంటు బిల్లు కట్టాలని లైన్ మెన్ అడిగాడు. నన్నే కరెంటు బిల్లు కట్టమంటావా? అంటూ పంచాయితీ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే డీఈని పిలిచి వెంటనే అతడిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేయమని చెప్పాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక డీఈ స్థాయిలో ఉన్న మీరు నిజాయితీ పరుడైన లైన్ మెన్ ను ట్రాన్స్ ఫర్ చేయడం ఏంటని నేను అడిగితే, మీకు తెలియనిది ఏముందండి, ఎమ్మెల్యే చెప్పినట్లు చేయకపోతే నేను ఈ పదవిలో ఉండలేని అని చెప్పాడు. నీతి, నిజాయితీ, సిన్సియారిటీ ఏమీ లేదు. రాజకీయనాయకులకు అణిగిమణిగి ఉంటేనే ఉద్యోగం చేసుకోవచ్చు. లేదంటే ఇబ్బందులు తప్పవు. మరో మండలంలో ఓ ఎక్సైజ్ అధికారి రాష్ట్ర స్థాయి పోలీసు అధికారి బామ్మార్ది అక్రమంగా లిక్కర్ బిజినెస్ చేస్తున్నాడని కేసు ఫైల్ చేస్తే, సదరు అధికారి పై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోపానికి వచ్చాడు.
తాజాగా సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో ఓ పోలీస్ కానిస్టేబుల్ జనాల పట్ల దురుసుగా వ్యవహరించడం కళ్లారా చూశాను. ఇదేం పరిస్థితి అని అడిగిన నాతోనూ అడ్డగోలుగా మాట్లాడాడు. ఇదే విషయాన్ని అక్కడి సీఐతో పాటు ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. సదరు కానిస్టేబుల్ ను పిలిచి నోటీసు ఇస్తామని చెప్పారు. కానీ, ఇప్పటికి నోటీసు కాదు కదా, కనీసం పిలిచి అడిగిన పాపానపోలేదు. కంప్లైంట్స్ పట్టించుకునే పరిస్థితి లేదు మన ఫ్రెండ్లీ పోలీసులకు. అదే ఫిర్యాదుకు పొలిటికల్ ప్రెజర్ ఉంటే పని అయ్యేదేమో. తాజాగా కనగల్లు మండల పరిధిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మీద అర్థరాత్రి హత్యాయత్నం జరిగింది. సదరు జవాన్ డయల్ 100 కు కాల్ చేసి పరిస్థితి వివరించాడు. వెంటనే వచ్చి తనను కాపాడాలని వేడుకున్నాడు. కానీ, సదరు కాల్ రిసీవ్ చేసుకున్న నైట్ డ్యూటీ పోలీసు అధికారి విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోగా, సదరు జవాన్ నే కించపరిచేలా మాట్లాడాడు. కాపాడాలని ఫోన్ చేస్తే, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడేంటని జవాన్ కంటతడి పెట్టడంతో స్థానికులు అతడిని 108 సాయంతో హాస్పిటలకు తరలించారు. పోలీసులు సీరియస్ విషయాలను కూడా పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఈ మధ్యే జరిగిన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. పొలిటికల్ అండదండలతో ఉద్యోగం చేయకుండా బెదిరించే ఉద్యోగుల సంఖ్య చేతాడు అంత ఉంది. ఇక్కడ వాళ్ల ఉద్యోగ స్థాయితో పనిలేదు వాళ్లు పొలిటికల్ పవర్ ని ఎంత ఉపయోగిస్తున్నారు అన్నదే లెక్క.
అధికారులంతా నిప్పుల్లా ఉండాలని చెప్పడం నా ఉద్దేశం కాదు గానీ, మీకంటూ ఓ ఆత్మగౌరవం ఉంటుందని, దాన్ని వదిలి బతికినా బతకనట్టే అని మాత్రం చెప్పగలను. పదవుల కోసం రాజకీయ నాయకుల కాళ్లదగ్గర తలదించకండి.
================
_శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్, నల్లగొండ