యోగి-యోగ్యత.. “జీవన సాఫల్య పురస్కారం”..

ఆర్. దిలీప్ రెడ్డి : ( సీనియర్ జర్నలిస్ట్)

83 సంవత్సరాల పెద్దమనిషి  వెనక్కి తిరిగి చూసుకుంటే…. 42 సంవత్సరాలకు పైబడి పర్యావరణ పరమైన ప్రజాజీవితాన్ని …నిరంతరాయంగా కొనసాగించడం! వ్యవసాయోద్యమాలు, కాలుష్య వ్యతిరేక పోరాటాలు, అణు రియాక్టర్ రాకను అడ్డుకోవడం, ఫ్లోరోసిస్ పై ఆందోళనలు, నీళ్ల కోసం నిరసనలు, యురేనియం తవ్వకాల్ని నిలువరించడం…. ఇలా ఒక్కటేమిటి! “ఆతడనేక యుద్దముల ఆరితేరిన యోద్ద…” అన్నట్టు ముందుండి ఎందరెందరినో నడిపించారు.

జర్నలిస్టులు, న్యాయవాదులు, యాక్టివిస్టులు… ఇలా ఎవరెవరికైనా రిసోర్స్ పర్సన్ గా ఉంటూ, ‘పర్యావరణానికి’ పర్యాయపదమయ్యారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ’ ఇదంతా గుర్తించి ఈ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ డా.సి.వి. ఆనంద బోస్ చేతుల మీదుగా అందించారు. సొసైటీ చైర్మన్ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) ఎ.కె. పట్నాయక్, ప్రధాన కార్యదర్శి డా. వినోద్ సేథీ ల సమక్షంలో ఇండియా ఇస్లామిక్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కుటుంబ సభ్యులతో పాటు Council for Green Revolution (CGR) సంస్థాపకులు కె.లక్ష్మారెడ్డి గారు, విధాన విశ్లేషకులు ప్రొ. దొంతి నర్సింహారెడ్డి గారు, యువ న్యాయవాదులు శ్రావణ్ కుమార్, రఘువర్దన్రెడ్డి, పవన్ కుమార్, సామాజిక కార్యకర్త శ్రావ్యరెడ్డి, నేను…. తదితరులం పాల్గొన్నాం.

యోగి-యోగ్యత: తరతరాల మనిషి మనుగడకు సురక్షితమైన ఒడి ప్రకృతి. పర్యావరణ వినాశనాన్ని ఆపుదామని…. దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ముని, మర్యాద పురుషోత్తముడు ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి. సుమారు అర్ద శతాబ్దకాలంగా నిరంతరాయం ఈ పనిలో వున్న ఋషిపుంగవుడు. ఇదాయనకు వృత్తి కాదు, ఉద్యోగం కాదు….. కానీ, నయాపైసా ఆశించకపోగా నాణ్యమైన తన సమయాన్ని, శ్రమని, వ్యయాన్ని, ఒక రకంగా జీవితాన్నే వెచ్చించారు. పచ్చదనం, పర్యావరణం, ప్రకృతి అనే కాదు…. మనిషి జీవన ప్రమాణాల వృద్ది కోసం ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని నిరంతర చింతన చేసే, ప్రజా పోరాటాలు రచించే, ఉద్యమాలు నిర్మించే, అధికారిక దాష్ట్యాలకు నిరసన ప్రదర్శించే కర్మయోగి. “జీవన సాఫల్య పురస్కారం” అనే మాట… ఈయన కన్నా మరెవరికి గొప్పగా వర్తిస్తుంది?

జస్టిస్ కృష్ణ అయ్యర్, జస్టిస్ భగవతి, జస్టిస్ కుల్దీప్ సింగ్ వంటి మహనీయుల ఆలోచనల పర్యవసానంగా పుట్టి, నడుస్తున్న ‘క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ-ఢిల్లీ’ వారు ప్రకటించిన ఈ అవార్డు ప్రదానం ఢిల్లీలో.జర్నలిజం పుణ్యమా అని గత మూడు దశాబ్దాలుగా ఆయన ఆలోచనల ప్రభావంలో, సాహచర్యంలో ఉండటం నాకు లభించిన అదృష్టంగా భావిస్తాను. మా ప్రియమైన, ఆదర్శవంతులు, మార్గదర్శి అయిన ప్రొఫెసర్ గారికి హృదయపూర్వక అభినందనలు.