Maghamasam:
మాఘమాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం. మాఘం అనగా యజ్ఞం. యజ్ఞం యుగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైందని పురాణాలు చెబుతున్నాయి.
ఈమాసంలో మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదిస్నానాలు చేయడం మాఘమాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నానం పుణ్యఫలమే మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.
మాఘమాసంలో సూర్యని కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆధునిక శాస్త్రవేత్తలు జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని.. వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమైనవని పేర్కొంటున్నారు. ఈస్నానాలకు అధిష్టానదైవం సూర్యభగవానుడు గనుక స్నానాంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఓ ఆచారం.
పన్నెండేళ్ల పుణ్యఫలం ;
మాఘమాసం లో సూర్యోదయానికి ముందు గృహస్నానంతో ఆరుసంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుందని భారతీయుల నమ్మకం. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని.. తటాక స్నానం ద్విగుణం..నదీస్నానం చాతుర్గణం.. మహానది స్నానం శతగుణం..గంగానదీ స్నానం సహస్త్రగుణం..త్రివేణి సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణ కథనం.
మాఘమాసం మహిమ:
మాఘపూర్ణిమను మహామాఘ అంటారు. స్నానదాన జపాలకు అనుకూలం. మాఘము అనేపదానికి సంస్కృతంలో పాపం అని అర్థం.మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని పండితులు చెబుతారు. అందుకే ఈమాసంలో సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం. అంతేకాక మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవడంటే భగవంతుడు. ఈమాసంలో గణపతి ,సూర్యతదితర దేవతల పూజలు ,వ్రతాలు చేస్తే శ్రేయస్కరం.
ప్రత్యేకత: ఈమాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వులదానం లాంటివి చేయాలి. శుద్దవిదియనాడు బెల్లం, ఉప్పుదానం చేయటం మంచింది.
- ఈమాసంలో వచ్చే ముఖ్యతిధి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అని కూడా అంటారు. దీన్నే కుంద చతుర్ధి అని అంటారు. ఈతిధిలో నువ్వులను తింటారు. డుంఢిరాజును ఉద్దేశించి నక్తవ్రతం పూజ చేస్తారు. డుండిని ఈవిధంగా పూజించడం వలన దేవతల చేత పూజలందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు.
- మాఘమాసాన్ని కుంభ మాసం అనికూడా అంటారు. కొంతమంది ఈమాసంలో ముల్లంగాదుంపను తినరు. నువ్వులను,పంచదారను కలిపి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
- ఈమాసంలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందని నమ్మకం.
- ఈమాసంలో ఉత్తర భారతదేశంలో విష్ణుమార్తిని, సరస్వతీదేవిని పూజిస్తారు.